ఆ ఉద్యమానికి టీడీపీ నాయకత్వం : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే ముఖ్యమంత్రి జగన్ కంకణం కట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తమపై కేసులు పెడితే భయపడమని, ప్రజాసమస్యలపై పోరాడుతామని తెలిపారు. రాష్ట్ర పరిస్థితి చూసి బాధ, ఆవేదన కలుగుతున్నాయన్నారు. దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని సీఎం మూడు రాజధానులు కడతాడట అని విమర్శించారు. రాష్ట్రం నుంచి విదేశాలకు గంజాయి, డ్రగ్స్ పంపే పరిస్థితిని తీసుకొచ్చారు. మరో ప్రజాఉద్యమం అవసరం.. దీనికి అందరూ కలిసి రావాలి. ఆ ఉద్యమానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. రాష్ట్రంలో ఉన్న అందరూ పన్నులు కడుతున్నారు. వైసీపీ శ్రేణులకు కూడా పన్నులు, ఛార్జీల బాదుడు ఉంది. రాష్ట్ర పునర్ నిర్మాణానికి వైసీపీ శ్రేణులు కూడా కలిసి రావాలి. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నాయకులు ప్రజలకు అండగా ఉండాలని, వాళ్లే ముందుండి నడిపించాలి అని పిలుపునిచ్చారు. ముగ్గరు ఆడ్డబిడ్డలపై అత్యాచారం జరిగింది. హోంశాఖ మంత్రి తల్లుల పెంపకంపై మాట్లాడటం సిగ్గుచేటు. సజ్జల రాసిన స్టేట్మెంట్లను ఆమె చదువుతున్నారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవడానికి అందరూ ఉద్యమించాలన్నారు. నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చి రూ.కోట్లు సంపాదించే అవకాశం కల్పిస్తే, జగన్ వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చి రూ.5 వేలు పడేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను జగన్ అంధకారం చేస్తున్నారు. కరెంట్ బిల్లులను 40 శాతం పెంచారు. కరెంట్ రాదు కానీ బిల్లులు మాత్రం బాదుడే అని మండిపడ్డారు. జంగారెడ్డిగూడెం సారా మరణాలు సహజ మరణాలంటూ కొట్టిపారేశారన్నారు.