పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 23న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రతి ఎమ్మెల్యే ఓటు కీలకంగా మారడంతో తమ పార్టీ ఎమ్మెల్యేలకు తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసింది. మొత్తం 23 మంది పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీ ఎమ్మెల్యే, విప్ డోల బాలవీరాంజనేయస్వామి విప్ జారీ చేశారు. విప్‌ను ఆయన ఎమ్మెల్యేలకు స్పీడ్ పోస్టులో పంపించడంతో పటు వ్యక్తిగతంగా కూడా అందజేశారు. 23న జరిగే ఎన్నికల్లో పాల్గొని తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేయాల్సిందిగా స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో స్థానంలో అభ్యర్థి గెలవాలంటే 22 నుంచి 23 ఓట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతం టీడీపీ తరపున 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, వారిలో నలుగురు పార్టీకి దూరంగా ఉంటున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి వైసీపీకి మద్దతు ప్రకటించారు. మరో వైపు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారు ఆత్మప్రభోధానుసారం ఓటు వేస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీ విప్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.