టీడీపీలో సీట్ల కుమ్ములాట.. డైరెక్ట్ వార్నింగ్‌లకు దిగుతున్న నేతలు

టీడీపీలో సీట్ల కుమ్ములాట.. డైరెక్ట్ వార్నింగ్‌లకు దిగుతున్న నేతలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే తెలుగుదేశం పార్టీలో సీట్ల కుమ్ములాట మొదలైంది. టికెట్ మాకు కావాలంటే మాకు కావాలని, టికెట్ ఇవ్వకపోతే తామేంటో పార్టీకి చూపిస్తామని బెదిరింపులకు దిగుతూ అధిష్టానంపైనే నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారట. దీంతో పార్టీలో ట్రబుల్ షూటర్లు కొంతమంది వాళ్లని కూల్ చేసే పనిలో పడ్డారట. 

ఈ మధ్య విజయవాడ ఎంపీ కేశినేని నాని.. అనేకసార్లు మీడియా ముందు మాట్లాడుతూ పార్టీ టికెట్లపై కీలక కామెంట్స్ చేశారు. తన సోదరుడితో పాటు స్థానిక నేతలు నాగుల్ మిరా, జలీల్‌ఖాన్‌‌లతో వివాదాలు ఉన్నందున వాళ్లకి టికెట్‌లు ఇస్తే సహకరించేది లేదంటూ పార్టీ అధిష్టానానికే నేరుగా వార్నింగే ఇచ్చేశారు. అలాగే పార్టీ తనకు టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసే సత్తా కూడా తనకు ఉందంటూ బహిరంగంగానే సవాల్ విసిరారు. దానికి తోడు పార్టీలో కీలక నేతలైన బుద్ధా వెంకన్న, దేవినేని ఉమలకు కూడా ఈ సారి టికెట్ ఇవ్వొద్దని, కుదిరితే తన కుమార్తెకు టికెట్ ఇవ్వాలని కేసినేని నాని అధిష్టానానికి సందేశం పంపినట్లు తెలుస్తోంది. ఇది ఇతర నేతలతో పాటు పార్టీలోనూ కలకలం సృష్టించింది. 

ఈ గొడవ ఇంకా ముగియక ముందే గుంటూరులో మరో వివాదం మొదలైంది. జిల్లా సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు గుంటూరు జిల్లా టికెట్ల పంచాయితీని తెరమీదకు తీసుకొచ్చారు.  తన కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వాలంటూ మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. తన కుమారుడు రంగబాబును రంగంలోకి దింపుతానని.. పార్టీ ఆయనకు టికెట్‌ ఇవ్వనంటే తానే రంగంలోకి దిగుతానన్నారు.

గుంటూరు జిల్లా అసెంబ్లీ టికెట్ల పంచాయితీ గురించి మాట్లాడుతూనే నరసరావుపేట ఎంపీ టికెట్‌పై కూడా రాయపాటి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ స్థానం నుంచి స్థానికులే పోటీ చేయాలని, నాన్‌ లోకల్‌ క్యాండిడేట్‌ను తీసుకొస్తే మాత్రం గెలిపించబోమని స్పష్టం చేశారు. ఈ స్థానం నుంచి కడపకు చెందిన ఓ సీనియర్ నేత కుమారుడు కన్నేశారని.. ఎప్పటి నుంచో ఇక్కడ కార్యకలాపాలు జరుపుతున్నారని ప్రచారం నడుస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా రాయపాటి సాంబశివరావు ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జోరుగా సాగుతోంది. 

ఇదిలా ఉంటే ఒకపక్క జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీచేయాలని టీడీపీ భావిస్తుండడం వల్లే ఇలా జరుగుతోందని అంచనాలు వినిపిస్తున్నాయి. జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల తమకెక్కడ టికెట్ ఇవ్వరో అనే భయంలోనే ఇలా ఒక్కో జిల్లా నేతలు బహిరంగ హెచ్చరికలకు దిగుతున్నారనేది విశ్లేషకుల అంచనా. మరి వీళ్లందరినీ టీడీపీ ఎలా సంయమనం చేస్తుంది? ఎలా ముందుకెళుతుంది? నిజంగానే జనసేనతో పూర్తిస్థాయి పొత్తు పెట్టుకుంటుందా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

 

 

Tags :