జయరాం కోమటి చేతుల మీదుగా టీడిపి సభ్యత్వ నమోదు ప్రారంభం

ఎన్నారై తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో అమెరికాలో తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్నారై తెలుగుదేశం పార్టీ సమన్వయ కర్తగా నియమితులైన జయరాం కోమటి, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ సమక్షంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
వెంకట్ కోగంటి వ్యాఖ్యాతగా మిల్పిటాస్లోని స్వాగత్ హోటల్లో ఇటీవల జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం, సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం అయ్యింది. ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అభిమానులు తరలి వచ్చారు. సామాజిక అసమానతలు తొలగించే సమున్నత లక్ష్యంతో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగే ఏకైక పార్టీ తెలుగుదేశమంటూ జయరాం కోమటి వ్యాఖ్యానించారు.
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మాట్లాడుతూ 2024లో ఎన్నారైలందరూ ఒక్కటై ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు అవసరం కొత్త రాష్ట్రానికి ఉందని ప్రజలు భావించి 2014లో ఆయనను గెలిపించారన్నారు. 2019 ఎన్నికల నాటి అబద్ధాల వల్ల తాము మోసపోయామంటూ తెలుగు ప్రజలు జరిగిన పొరపాటును గ్రహించి 2024 ఎన్నికల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు.
సమావేశంలో చెన్నుపాటి వజీర్, మన్నవ సుబ్బారావు, గుంటుపల్లి చంద్ర, దొడ్డపనేని శ్రీకాంత్, భల్ల భక్త, కాకర్ల రజనీకాంత్, ఆసూరి విజయ, కోమటి గంగ తదితరులు కూడా మాట్లాడారు.