హైదరాబాద్ మెట్రో విస్తరణ... ఎయిర్‌పోర్ట్ వరకు ప్రయాణం

హైదరాబాద్ మెట్రో విస్తరణ... ఎయిర్‌పోర్ట్ వరకు ప్రయాణం

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలను అధిగమించేందుకు ఏర్పాటు చేసిన మెట్రో రైలు ఇప్పుడు బహుళ ప్రజాదరణ పొందింది. రోజు లక్షలాదిమంది ప్రయాణికులతో కిటకిటలాడుతున్న హైదరాబాద్‌ మెట్రోను కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. వేలాదిమంది ప్రయాణించే ఎయిర్‌పోర్టుకు ఇంతవరకు మెట్రో కనెక్టివిటీ లేదు. ఇప్పుడు సిటీ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు మెట్రోలో వెళ్ళేలా ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన  నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఐటీ కారిడార్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు అత్యంత వేగవంతమైన ప్రజా రవాణా సాధనంగా మెట్రోను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కే.టీ.రామారావు తెలిపారు.మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోని కారిడార్‌-3లో నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకు మెట్రోను కలుపుతూ ఔటర్‌ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్‌ విమనాశ్రయం లోపలి వరకు 31 కి.మీ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. సుమారు రూ. 6,250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించే ఈ ప్రాజెక్టుకు డిసెంబర్‌ 9న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారని కేటీఆర్‌ తెలిపారు. హైస్పీడ్‌ మెట్రో రైలు ప్రాజెక్టుగా ప్రభుత్వం దీన్ని చేపట్టాలని నిర్ణయించి, ఇప్పటికే ఢల్లీి మెట్రో రైలు సంస్థతో డీపీఆర్‌ను సిద్ధం చేసి ఉంచింది.

ఇతర సంస్థల భాగస్వామ్యంతో నిర్మాణం

హైస్పీడ్‌ ఎయిర్‌ పోర్టు మెట్రో రైలు ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టేందుకు వినూత్న పంథాను తెలంగాణ ప్రభుత్వం అవలంబించనుంది. నగరంలో చేపట్టిన హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు తరహాలో పూర్తిగా పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యంలో కాకుండా ప్రాజెక్టు వ్యయాన్ని పలు సంస్థలు భరించేలా చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్‌పీవీ) పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్‌ మెట్రో రైలు లిమిటెడ్‌తో పాటు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ), తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ), జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌లను భాగస్వాములను చేయనుంది.

ప్రపంచంలోనే ఉత్తమ శ్రేణి విమానాశ్రయాల్లో ఒకటిగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. నగరం నుంచి సుమారు 31 కి.మీ దూరం ఉన్న విమానాశ్రయానికి చేరుకునేందుకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెట్రో రైలు మార్గం అత్యంత కీలకంగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్‌ సంస్థతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఈ ప్రాజెక్టులో తమ వంతు వాటా 10 శాతం మేర పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిని కనబర్చింది. మెట్రో రైలు మార్గంతో ఎయిర్‌పోర్టుకు అనుసంధానమే విమానయాన రంగానికి మరింత ప్రయోజనం చేకూరుతుందనే ఉద్ధేశ్యంతో జీఎంఆర్‌ ఉంది.

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతో మెట్రో రైలు మార్గం అనుసంధానమైతే కేవలం 25-30 నిమిషాల్లో విమానాశ్రయం నుంచి ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం, మైండ్‌ స్పేస్‌, హైటెక్‌ సిటీ సైబర్‌ టవర్స్‌కు చేరుకోవచ్చు. సుమారు 30 కి.మీ దూరం ఉండే ఈ మార్గంలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక మెట్రో స్టేషన్‌ చొప్పున సుమారు 7-8 మెట్రో స్టేషన్లను నిర్మించేలా డీపీఆర్‌ను సిద్ధం చేశారు. ఇందులో ప్రధానంగా బయో డైవర్సిటీ జంక్షన్‌, నానక్‌రాంగూడ, నార్సింగి, టీఎస్‌ పోలీస్‌ అకాడమీ, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌టౌన్‌, ఎయిర్‌పోర్టు కార్గో స్టేషన్‌, టర్మినల్‌ వద్ద మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు.

 

Tags :