టీఎస్‌పీఎస్‌సీ కీలక నిర్ణయం

ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తో పాటు ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దు చేసిన గ్రూప్`1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ ఏడాది జూన్ 11న నిర్వహించాలని నిర్ణయంచింది. మిగతా పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పేపర్ లీకేజీ కారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక ఆధారంగానే ఈ పరీక్షలను సైతం రద్దు చేయాలని నిర్ణయించినట్టు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. గతేడాది అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు. ఇవికాకుండా త్వరలో నిర్వహించనున్న మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్‌పీఎస్‌సీ ఉన్నట్లు సమాచారం. టీఎస్‌పీఎస్‌సీ సమావేశమై ప్రస్తుత పరిణామాలపై చర్చించింది. సిట్ నివేదిక, అంతర్గత విచారణను పరిగణనలోకి తీసుకున్న తర్వాత గ్రూప్-1, ఏఈఈ, డీఏఈ ఎగ్జామ్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది టీఎస్‌పీఎస్‌సీ.