అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ పురస్కారం అందుకున్న మంత్రి కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు మరో అరుదైన ఖ్యాతిని గడించింది. ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ఏఎస్‌సీఈ) సంస్థ నుంచి విశ్వ వేదికపై అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకున్నది. అమెరికాలోని నెవాడా రాష్ట్రం హెండర్సన్ నగరంలో నిర్వహించిన వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ 2023లో కాళేశ్వరం ప్రాజెక్టును ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రోగ్రెస్ (ఇంజినీరింగ్ ప్రగతికి సుస్థిర ప్రతీక) గా గుర్తించి అవార్డుతో ఏఎస్‌సీఈ సత్కరించింది. ఈ సదస్సుకు హాజరైన మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వ నీటి విజయాలు, కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులపై అద్భుతమైన ప్రసంగం చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో కరువును తరమేసిన విధానాన్ని నదినే ఎత్తిపోసిన విధానాన్ని వివరిస్తుంటే వివిధ దేశాల నేతలు అబ్బురపడ్డారు. కాళేశ్వరం ఒక కలికితురాయి అని పొగడ్తలతో ముంచెత్తారు. దాని ఘనతలను మంత్రి కేటీఆర్ చెప్పుంటే చప్పట్లతో హోరెత్తించారు.