తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వినూత్నంగా ఘనంగా ‘తెలుగు భాషా దినోత్సవ వేడుకలు’

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వినూత్నంగా ఘనంగా ‘తెలుగు భాషా దినోత్సవ వేడుకలు’

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలోవ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి జయంతి (ఆగష్టు 29)ని పురస్కరించుకుని ‘తెలుగు భాషా దినోత్సవ’ వేడుకలను ఆగస్టు 28, 29వ తేదీల్లో అంతర్జాతీయస్థాయిలో వర్చువల్‍ విధానంలో ఘనంగా నిర్వహించారు.  ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుగుతున్న కార్యక్రమాలలో ఇది 16వ సమావేశం. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తన స్వాగతోపన్యాసంలో వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి గారి కృషిని, ఆయనకు ఆ ఉద్యమంలో సహకరించిన అనేకమంది సాహితీ వేత్తలకు ఘన నివాళులర్పించి సభను ప్రారంభించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్‍ ఒక మధురమైన తెలుగు పద్యం పాడి సభలో తెలుగుదనం నింపారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్‍ తోటకూర అతిథులకు, వక్తలకు ఆహ్వానం పలికారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పశ్చిమ బెంగాల్‍ రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మరియు సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా ఉన్న తెలుగు సంతతికి చెందిన డా.శశి (పిల్లలమర్రి) పంజాను సభకు పరిచయం చేశారు. శశి నాన్నగారిది (పిల్లలమర్రి వేంకట కృష్ణయ్య) తెనాలి అని, అమ్మగారిది (మాధవపెద్ది సీతాదేవి) గుంటూరు అని, ఆమె అన్నయ్య (మోహన్‍) పుట్టింది నరసరావు పేట అని గుర్తు చేశారు. కానీ, చిన్నప్పటి నుంచి కోల్‍కతాలో పెరగడం, చదవడం, ఉద్యోగంతో పాటు రాజకీయాలలో కూడా రాణించడం ముదావహం అన్నారు. వ•తిరీత్యా వైద్యురాలిగా తీరికలేకుండా ఉంటూ కూడా రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుకుగా పాల్గొనడం చాలా అభినందనీయం అని అన్నారు. 

డా. శశి పంజా మాట్లాడుతూ.. మాజీ కేంద్రమంత్రి అజిత్‍ కుమార్‍ పంజా కుమారుడు డా. ప్రసన్నకుమార్‍ పంజాతో వివాహం కావడం వల్ల తన పేరు శశి పంజాగా మారిందని తెలిపారు. ఎందరో మహానుభావులు పుట్టిన తెలుగు నేలపై పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. నాన్న ఉద్యోగరీత్యా కోల్‍కతాలో స్థిరపడడంతో చిన్నపటి నుంచి తెలుగు నేలకు దూరం అయ్యాం గాని తెలుగు భాషకు కాదని, ఇప్పటికీ మేము ఇంట్లో తెలుగే మాట్లాడతామన్నారు. మధురమైన మన తెలుగు భాషను మాట్లాడే వారు బెంగాల్‍ రాష్ట్రంలో చాలామంది ఉన్నారని, అందుకే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‍ రాష్ట్రంలో తెలుగును ఇటీవలే అధికార భాషగా గుర్తించారని తెలియజేశారు. తెలుగు వ్యవహారిక బాషగా ఉండాలనే ఉద్యమంలో గిడుగు వెంకట రామమూర్తి తన సర్వసాన్ని త్యాగం చేశారని గుర్తు చేస్తూ ఆయనకు నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలుగు భాషా దినోత్సవ వేడుకలని ఘనంగా నిర్వహిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదికకు అభినందనలను తెలియజేశారు.

ఈ సభలో ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ళ భరణి విశిష్ట అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాలలో తెలుగు దీనావాస్థ స్థితిలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు విదేశాలలో ముఖ్యంగా తానా ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు వైభవంగా జరగడం చాల సంతోషించదగ్గ విషయం అన్నారు. తనికెళ్ళ భరణి తెలుగులో రచించిన ‘‘ఎందరో మహానుభావులు’’ అనే గ్రంధాన్ని సత్య భావన అనే రచయిత్రి ఆంగ్లానువాదం చేసిన ప్రతిని మంత్రి డా. శశి పంజా ఆవిష్కరించారు. మన తెలుగు సంతతికి చెందిన వ్యక్తి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‍ రాష్ట్ర డైరెక్టర్‍ జనరల్‍ ఆఫ్‍ పోలీస్‍గా సేవలందిస్తున్న డా. బొప్పూడి నాగ రమేష్‍, ఐపీఎస్‍ ఈ సభలో ఒక విశిష్ట అతిథిగా పాల్గొని ఎంతోమంది సంగీత విద్వాంసుల జీవిత చరిత్రలను అత్యంత మనోహరంగా భరణి చిత్రీకరించారని, అందరూ చదవవలసిన పుస్తకం అని పుస్తక సమీక్ష చేశారు.

రెండో రోజు సభలో శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల పల్లెనుంచి ఢిల్లీలో క్రీడా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఎదిగిన సిడ్నీ ఒలింపిక్స్ పతక విజేత పద్మశ్రీ డా. కరణం మల్లేశ్వరి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మల్లేశ్వరి మాట్లాడుతూ తెలుగు వ్యక్తిగా పుట్టడం తన అదృష్టం అని, మన భాషను రక్షించుకునేందుకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక కోసం తెలుగు వైభవం, సాహితీవేత్తలపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి విడుదల చేశారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్‍ తోటకూర మాట్లాడుతూ.. ఇకనుంచి ప్రతి నెలా సాహిత్య కార్యక్రమానికి ముందు ఈ వీడియోను ప్లే చేస్తామని, ఈ గీతాన్ని రాసిన తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, స్వరపరచిన సంగీత దర్శకులు నేమాని పార్థసారథి, గానం చేసిన అమర గాయకులు ఎస్‍పీ బాలసుబ్రహ్మణ్యంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు రోజులపాటు జరిగిన వేడుకల్లో గిడుగు వేంకట రామమూర్తి గారితో సహా మొత్తం 17 మంది లబ్ద ప్రతిష్టులైన విశిష్ట సాహితీవేత్తలను వారి కుటుంబ సభ్యులే పాల్గొని ఆ నాటి సామాజిక పరిస్ధితులు, వారి జీవన విధానం, సహా రచయితలతో వారి అనుబంధం, వారి సాహిత్య సృష్టి మొదలైన ఎన్నో పుస్తకాలలో లభ్యంకాని ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం సాహిత్య చరిత్రలోనే ఒక సరికొత్త కోణం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికి  హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.  

పాల్గొన్న విశిష్ట సాహితీవేత్తల కుటుంబ సభ్యులు:   

తెనుగు లెంక, ఆధునిక పద్య కవి, పండితుడు డా. తుమ్మల సీతారామమూర్తి చౌదరి కుమారుడు - తుమ్మల శ్రీనివాసమూర్తి జాతీయవాది, ప్రముఖ కవి, రచయిత డా. రాయప్రోలు సుబ్బారావు గారి మనుమరాలు ఆచార్య డా. మనోరమ (రాయప్రోలు) కానూరి సుప్రసిద్ధ కవి, హేతువాది, చలనచిత్ర సంభాషణల రచయిత డా. కొండవీటి వేంకట కవి కుమార్తె ఆచార్య డా. కొండవీటి విజయలక్ష్మి ప్రముఖ సాహితీవేత్త, ప్రముఖ చలనచిత్ర కథా, హాస్య సంభాషణల రచయిత డా.ముళ్ళపూడి వెంకటరమణ కుమారుడు వర ముళ్ళపూడి రేడియో ప్రయోక్త, నటుడు, చలనచిత్ర కథా, మాటల రచయితడా. గొల్లపూడి మారుతీరావు కుమారుడు గొల్లపూడి రామకృష్ణ వేదాంత వేత్త, తెలుగు సాహితీ వేత్త, సంఘ సంస్కర్త బ్రహ్మర్షి డా. ఉమర్‍ ఆలీషాసూఫీ మునిమనవడు డా. ఉమర్‍ ఆలీ షా కవితా విశారద, కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్‍ డా. గుర్రం జాషువా  మునిమనవడు గుర్రం పవన్‍ కుమార్‍ సుప్రసిద్ధ భావకవి, ప్రముఖ చలనచిత్ర గీత రచయితపద్మభూషణ్‍ డా. దేవులపల్లి కృష్ణశాస్త్రి  మనవరాలు రేవతి అదితం వాడుక భాషోద్యమ పితామహుడు, బహు భాషాశాస్త్రవేత్త కళాప్రపూర్ణ గిడుగు వెంకట రామమూర్తి మునిమనవరాలు గిడుగు స్నేహలతా మురళి  ప్రముఖ కవి, సామాజిక చైతన్య రచయిత పద్మభూషణ్‍ డా. బోయి భీమన్న సతీమణి హైమవతీ భీమన్న సంఘ సంస్కర్త, హేతువాది, అభ్యుదయ కవి గురజాడ అప్పారావు మునిమనవరాలు అరుణ గురజాడ  ప్రముఖ కవి, విమర్శకుడు, పండితుడు, సాహితీవేత్త రాష్ట్రేందు డా. గుంటూరు శేషేంద్రశర్మ కుమారుడు గుంటూరు సాత్యకి ‘‘సరస్వతీ పుత్ర’’, సుప్రసిద్ధ కవి పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణాచార్యులు కుమార్తె డా. పుట్టపర్తి నాగపద్మిని కవి సమ్రాట్‍, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్‍ డా. విశ్వనాథ సత్యనారాయణ మనవడు విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, గొప్ప భావకుడు డా. రావూరి భరద్వాజ కుమారుడు రావూరి వెంకట కోటేశ్వర రావు, కోడలు లక్ష్మి ప్రముఖ సాహితీవేత్త, కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి కుమారుడు డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ అభ్యుదయ కవి, కథకుడు, నాటకకర్త దేవరకొండ బాలగంగాధర తిలక్‍ కుమారుడు డా. దేవరకొండ సత్యనారాయణ మూర్తి.

Click here for Event Gallery

 

Tags :