న్యూయార్క్ నగరంలో ఘనంగా ఉగాది వేడుకలు

అమెరికాలోని తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ (టీఎల్‌సీఎ) ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి సంబరాలు ఘనంగా జరిగాయి. న్యూయార్క్‌లోని ఫ్లషింగ్‌లో ఉన్న గణేష్ ఆలయంలో ఈ సంబరాలు జరిగాయి. టీఎల్‌సీఎ ప్రెసిడెంట్ నెహ్రూ కటారు, ఉపాధ్యక్షులు కిరణ్ పర్వతాల, సెక్రటరీ సుమంత్ రామ్‌శెట్టి, టీఎల్‌సీఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ అంకినీడు, సెక్రటరీ నాగేంద్ర గుప్త, ట్రెజరర్ రావు వోలేటి, మాజీ చైర్మన్లు కృష్ణ మద్దిపట్ల, వెంకటేష్ ముత్యాల, డాక్టర్ పూర్ణ అట్లూరితోపాటు ఎందరో లైఫ్ ట్రస్టీలు ఈ కార్యక్రమంలో సంతోషంగా పాల్గొన్నారు. శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకల్లో 140 మందికిపైగా చిన్నారులు తెలుగు పాటలు, నృత్యాలు, నాటకాలతో ప్రేక్షకులను అలరించారు.
ఉత్తర అమెరికాలోని పాత తెలుగు సంఘాల్లో టీఎల్‌సీఏ ఒకటి. ఈ సంస్థ 52 ఏళ్లుగా న్యూయార్క్ పరిసర ప్రాంతాల్లో తెలుగు సాహిత్యం, సంప్రదాయాలను ప్రచారం చేస్తోంది. మొత్తం 500 మందికిపైగా ప్రేక్షకులు పాల్గొన్న ఈ వేడుకలకు న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నొవేషన్ విభాగం డిప్యూటీ కమిషనర్ దిలీప్ చౌహాన్ స్వయంగా మేయర్‌ను సభకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మేయర్ ఎరిక్ ఆడమ్స్.. ఇంత ఘనంగా ఈ వేడుకలు నిర్వహించినందుకు టీఎల్‌సీఏ ప్రెసిడెంట్ నెహ్రూ కటారు, టీఎల్‌సీఏ బృందాన్ని కొనియాడారు.
దిలీప్ చౌహాన్ మాట్లాడుతూ న్యూయార్క్, లాంగ్ ఐలాండ్‌లోని తెలుగు కమ్యూనిటీతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. ప్రత్యేక అతిథిగా వచ్చిన తెలుగు నటి లయ.. మేయర్, డిప్యూటీ కమిషనర్‌కు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మేయర్‌కు టీఎల్‌సీఏ అధ్యక్షులు నెహ్రూ కటారు ధన్యవాదాలు తెలిపారు. టీఎల్‌సీఏ కార్యక్రమానికి మేయర్‌ను తీసుకొచ్చేందుకు కృషి చేసిన దిలీప్ చౌహన్‌కు అభినందనలు తెలియజేశారు. దిలీప్‌ను తామంతా ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఐదు దశాబ్దాలుగా టీఎల్‌సీఏ చేస్తున్న కృషిని చైర్మన్ అంకినీడు ప్రసాద్ నన్నపనేని వివరించారు. ఈ వేడుకలను ఇంత విజయవంతం చేసిన కమ్యూనిటీకి సెక్రటరీ సుమంత్ రామిశెట్టి ధన్యవాదాలు తెలిపారు.