ఈశాన్య రాష్ట్రాలు పర్యాటకరంగానికి కేంద్రాలు.. పర్యాటక సాంస్కృతిక సదస్సులో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి 

ఈశాన్య రాష్ట్రాలు పర్యాటకరంగానికి కేంద్రాలు.. పర్యాటక సాంస్కృతిక సదస్సులో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి 

పర్యాటక రంగం దేశంలో సామాజిక ఆర్థిక మార్పును తీసుకొస్తుందని, ముఖ్యంగా 8 ఈశాన్య రాష్ట్రాల (అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరాం, త్రిపుర సిక్కిం)లో పర్యాటకరంగంతో పాటు అనేక రంగాల అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. 

విభిన్న జాతులు, విభిన్న భాషలు, సంస్కవృతి, సాంప్రదాయాలు, విభిన్న కళారీతులు, విభిన్న ఆహారపుటలవాట్లు వంటి వైవిధ్యమే ఈశాన్య రాష్ట్రాలకు వరం అని అంటూ, దేశమంతా ఒకెత్తయితే, ఈశాన్య రాష్ట్రాలు ఒకెత్తని, అందుకే కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. అసోం రాజధాని గువాహటి నగరంలో ఈశాన్య రాష్ట్రాల మంత్రుల పర్యాటక, సాంస్కృతిక సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. జీవన వైవిధ్యం కల్గిన ఈశాన్య రాష్ట్రాల్లో పండుగలు, గిరిజన వేడుకలు ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయని, వాటికి ప్రచారం కల్పించడం ద్వారా గుర్తింపు లభిస్తుందని అన్నారు. తద్వారా పర్యాటకంతో పాటు సాంస్కృతిక రంగం కూడా వృద్ధి చెందుతుందని తెలిపారు. మన దేశంలోనే ఉన్న ఎన్నో అందమైన ప్రదేశాలున్నాయని, దేశీయంగా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడం కోసం 2019లోనే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేఖో అప్నా ఇండియా నినాదమిచ్చారని తెలిపారు. ఇందులో భాగంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఏడాదిలో 15 ప్రాంతాలను సందర్శించాలని గుర్తు చేశారు.

ఏ ఇతర రంగానికి లేని ప్రత్యేకత పర్యాటక రంగానికి ఉందన్న కిషన్‌ రెడ్డి, ఈ రంగంలో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే 70 నుంచి 80 మందికి ఉపాధి కల్పించవచ్చని, అదే ఉత్పాదక రంగంలో ఈ మొత్తంలో పెట్టిన పెట్టుబడితో 45 మందికి మాత్రమే ఉపాధి లభిస్తుందని అంతర్జాతీయ సర్వేలు చెబుతున్నాయని వివరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆదాయ వనరుల్లో పర్యాటక రంగమే ప్రదానమైనదని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకాభివృద్ధి వ్యూహాల గురించి ఈ రెండు రోజుల సదస్సులో చర్చించి, భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.  దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి ఎంత అభివృద్ధి సాధించాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టాలని అన్నారు. ఇందులో యువత ప్రధాన పాత్ర పోషిస్తూ టార్చ్‌ బేరర్స్‌గా నిలవాలని పిలుపునిచ్చారు. 

జాతీయ స్థాయిలో పర్యాటక విధానంపై దృష్టి

జాతీయస్థాయి పర్యాటక విధానాన్ని త్వరలో తయారు చేసుకుని, యాక్షన్‌ ప్లాన్‌తో అభివృద్ధి దిశగా ముందుకెళ్తామని కిషన్‌ రెడ్డి చెప్పారు. విదేశాలకు దీటుగా ఆయా రాష్ట్రాలు సరికొత్తగా విభిన్నంగా టూరిజం వెబ్‌సైట్లను డిజైన్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. సోషల్‌ మీడియా ద్వారా తమ రాష్ట్రాల్లోని పర్యాటక సాంస్కృతిక ప్రత్యేకత గురించి విస్తృత ప్రచారం చేసుకోవాలని చెప్పారు. రాబోయే రెండేళ్లలో 100 యూనివర్సిటీల నుంచి విద్యార్థులను ఇక్కడి తీసుకొచ్చి కల్చర్‌ ఎక్స్ఛేంజ్‌ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా బోర్డర్‌ టూరిజం మీద దృష్టి పెట్టబోతున్నట్టు వెల్లడిరచారు. సరిహద్దులో ఉన్న పర్యాటక ప్రాంతాలను పరీరక్షించి, అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. డిసెంబర్‌ నాటికి దేశంలో అత్యధిక భాగం జనాభాకు వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని, ఈ నేపథ్యంలో జనవరి నుంచి సరికొత్త విదేశీ పర్యటకులు, దేశీయ యాత్రికులను ఆహ్వానించడానికి, ఆకర్షించడానికి యాక్ష ప్లాన్‌ తయారు చేయబోతున్నామని కిషన్‌ రెడ్డి చెప్పారు.
 

Tags :