టిపాడ్‌ బతుకమ్మ సంబరాలకు రెడీ అవుతున్న డల్లాస్‌

టిపాడ్‌ బతుకమ్మ సంబరాలకు రెడీ అవుతున్న డల్లాస్‌

తెలంగాణా సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు డల్లాస్‌ తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ (టిపాడ్‌) అన్నీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఇప్పటికే కమిటీలను కూడా నియమించింది. మహిళ శక్తి స్వరూపిణిగా చెప్పే ఈ దసరారోజుల్లో వచ్చే సంబరాల్లో బతుకమ్మ పండుగ ముఖ్యమైనది. తమ పసుపు కుంకుమలు కలకాలం ఉండాలని, సౌభాగ్యంతో ఉండాలనీ తెలంగాణాలో తెలుగు ఆడపడుచులు బతుకమ్మను తంగేడుపూలతో అలంకరించి పండుగను వైభవంగా నిర్వహిస్తుంటారు. డల్లాస్‌లో కూడా ఈ పండుగను టిపాడ్‌ అంగరంగ వైభవంగా వేలాదిమందితో నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా ఈ పండుగను గతంలోకన్నా రికార్డులు సృష్టించేలా దాదాపు 10, 12వేలమందితో ఈ వేడుకను నిర్వహించాలని భావిస్తోంది. టిపాడ్‌ ఫౌండేషన్‌ కమిటి చైర్‌ అజయ్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ప్రెసిడెంట్‌  రమణ లష్కర్‌, బోర్డ్‌ చైర్‌ ఇంద్రాణి పంచర్పుల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.

అమెరికాలోని డల్లాస్‌లో ఉన్న తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బతుకమ్మ, దసరా సంబరాలకు ముహూర్తం ఖరారైంది. అక్టోబరు 1 శనివారం ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ (టిపాడ్‌) ప్రకటించింది. దాంతోపాటు ఈ వేడుకలను వేలాదిమందితో నిర్వహించేందుకు వీలుగా వివిధ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాలు కరోనా కారణంగా గతేడాది జరగలేదు. ఈ క్రమంలో ఈసారి వేడుకలను మరింత వైభవంగా నిర్వహించేందుకు టిపాడ్‌ కృషి చేస్తోంది. దీంతో గత రికార్డులన్నీ బద్దలయ్యే స్థాయిలో ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 

డల్లాస్‌లోని కామెరికా సెంటర్‌ వేదికగా పూర్ణకుంభంతో ప్రారంభమయ్యే వేడుకలు సాయంత్రం 4 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో హుషారుగా సాగుతాయి. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు సుమారు 3 వేల మంది మహిళలు బతుకమ్మ ఆడతారు. ప్రముఖ సినీ నటి రీతూ వర్మ కూడా ఈ బతుకమ్మ ఆటలో పాల్గొంటారు. ఆ తర్వాత దసరా పూజ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రఖ్యాత మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ రూబెన్స్‌ నేతృత్వంలో లైవ్‌ మ్యూజిక్‌ కాన్సెర్ట్‌ జరుగుతుంది. ఈ వేడుకలను స్థానికంగా ఉన్న తెలుగువారంతా కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.

- రమణ లష్కర్‌, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ప్రెసిడెంట్‌

టిపాడ్‌ గతంలో నిర్వహించినదానికన్నా ఈసారి మరింత ఉత్సాహంగా ఈ వేడుకలను రికార్డు సృష్టించేలా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రజలంతా పెద్దఎత్తున ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆహ్వానిస్తున్నాము. ఈసారి బతుకమ్మ నిర్వహణలో ఇప్పటికే వందలాదిమంది వలంటీర్లు, కమిటీ నాయకులు ముమ్మరంగా పాలుపంచుకుంటున్నారు. ఇండోర్‌లో జరిగే ఈ కార్యక్రమంలో వాతావరణ భయం లేకుండా అందరూ పాల్గొనవచ్చు. పార్కింగ్‌ ఉచితం, 3వేలమంది మహిళలతో బతుకమ్మ ఆటపాట జరుగుతుంది. సినీమా తారలతోపాటు, అందరికీ ఇష్టమయ్యే పాటలతో టాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ రూబెన్స్‌ ఆధ్వర్యంలో సంగీత కచేరిని కూడా ఏర్పాటు చేశాము. అందరూ హాజరై బతుకమ్మ ఆడాలని కోరుకుంటున్నాము.       

- ఇంద్రాణి పంచర్పుల, బోర్డ్‌ చైర్‌

బతుకమ్మ వేడుకలను నిర్వహించడంలో ఇప్పటికే మంచిపేరును తెచ్చుకున్న టిపాడ్‌ ఈసారి కూడా తెలంగాణ సంస్కృతి సంప్ర దాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ బతుకమ్మ వేడుకను అంగరంగ వైభవంగా డల్లాస్‌లో నిర్వహిస్తోంది. డల్లాస్‌లోని వారే కాకుండా పొరుగురాష్ట్రాలైన ఒక్లహామా, కాన్సాస్‌, అర్కన్సాస్‌ ఇతర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు కూడా ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరుతున్నాము. ప్రకృతిని పూజించే ఈ వేడుకలో అమ్మవారిని ప్రార్థించుకుని అందరం సకల సౌభాగ్యాలతో హాయింగా ఉండాలని కోరుకుందాం. అందరూ ఈ వేడుకకు వచ్చి బతుకమ్మను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాను.

మరింత వైభవంగా బతుకమ్మ.. దసరా వేడుకలు - టిపాడ్‌ కమిటీ ప్రకటన

డల్లాస్‌లో అంగరంగ వైభవంగా బతుకమ్మ, దసరా (విజయదశమి) వేడుకలు నిర్వహించడానికి డల్లాస్‌ తెలంగాణ ప్రజా సమితి (టీ-పాడ్‌) సిద్ధమవుతున్నది. విదేశాల్లో వైభవంగా బతుకమ్మ పండుగ నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి దృష్టిని ఆకర్షించిన టీ-పాడ్‌ ఈ ఏడాది కూడా అదే స్థాయిలో చేపట్టేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. గతేడాది దాదాపు 12 వేల మందితో బతుకమ్మ పండుగ నిర్వహించింది. ఈ ఏడాది సుమారు 16 వేల మందితో మహా సంబురంగా, మరింత ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించడానికి టీ-పాడ్‌ నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

డల్లాస్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అందుకు అనుగుణంగా బతుకమ్మ పండుగ నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టాలని టీ-పాడ్‌ నిర్ణయించింది. వచ్చేనెల ఒకటో తేదీన కొమెరికా ఈవెంట్‌ సెంటర్‌ (డాక్టర్‌ పెప్పర్‌ ఎరెనా) వేదికగా నిర్వహించే బతుకమ్మ వేడుకకు అందరినీ ఆహ్వానిస్తున్నది. పొరుగు రాష్ట్రాలు.. ఒక్లహామా, కాన్సాస్‌, అర్కన్సాస్‌లో ఉంటున్న తెలుగువారు కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారని టీపాడ్‌ ప్రతినిధులు తెలిపారు. ఫ్రిస్కో పట్టణంలోని శుభమ్‌ ఈవెంట్‌ సెంటర్‌లో ఈ మేరకు నిర్వహించిన సన్నాహక సమావేశంలో టీపాడ్‌ ఫౌండేషన్‌ కమిటీ చైర్‌ అజయ్‌ రెడ్డి, రఘువీర్‌ బండారు, రావు కల్వల, అధ్యక్షుడు రమణ లష్కర్‌, బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ చైర్‌ ఇంద్రాణి పంచెర్పుల, ఉపాధ్యక్షులు మాధవి లోకిరెడ్డి, పాండు పాల్వాయి పాల్గొన్నారు. భారీగా నిర్వహించే బతుకమ్మ వేడుకలకు కాలిఫోర్నియా నివాసి,హెల్త్‌కేర్‌ మొఘల్‌ డాక్టర్‌ ప్రేమ్‌రెడ్డి తన మద్దతు ప్రకటించారు. బతుకమ్మ పండుగ ఉత్సవాలు జరుపుకునేందుకు తమ వంతు సహాయ సహకారాలందిస్తామని నాటా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి కొర్సపాటి తెలిపారు. స్థానిక నాయకులు, వ్యాపారులు ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములమవుతామని తెలిపారు.

 

Tags :