గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు : రేవంత్

గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు : రేవంత్

2022 ఆగస్టులో గుజరాత్‌ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు కూడా జరుగుతాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయం వద్ద రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎవరు అడగకుండానే ముందస్తు ఎన్నికల ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్‌ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందన్నారు. తిరుగుబాటును ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్‌ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం సహకారంతో బీజేపీని బలోపేతం చేయడానికి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్‌ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారు అని అన్నారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చివరకు మిత్ర ద్రోహిగా మిగిలిపోతారు. హరీశ్‌రావును పూర్తిగా ఇంటికి పంపించే ప్రణాళిక కేసీఆర్‌ సిద్ధం చేశారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని రెండేళ్ల ముందే కేసీఆర్‌ ఎలా చేప్తారు? అని ప్రశ్నించారు. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి ఆశ చూపి ప్రజలను మోసం చేశారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి నామినేషన్‌లో ప్రక్రియలో ఒక్క దళిత నేతను కూడా భాగస్వామిని చేయలేదు. కేసీఆర్‌తో వేదిక పంచుకోవడానికి ఎంపీ రాములు, కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్‌ లాంటి వాళ్లు పనికిరారా? అని అన్నారు. సీఎం కేసీఆర్‌ అసహనంతో ఉన్నారని, ప్రతిపక్షాలను కుక్కలు, నక్కలతో పోల్చడమే ఇందుకు నిదర్శనమన్నారు. అభద్రతాభావంతో కేసీఆర్‌ పొంతన లేని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని రేవంత్‌ దుయ్యబట్టారు.

 

Tags :