MKOne TeluguTimes-Youtube-Channel

వై.ఎస్.అవినాశ్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ.. అరెస్టు ఖాయం..!

వై.ఎస్.అవినాశ్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ.. అరెస్టు ఖాయం..!

వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్ కు మారిన తర్వాత సీబీఐ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డిని ఇప్పటికే నాలుగు సార్లు విచారించింది. అయితే విచారణ పక్కదారి పడుతోందని, ఒక వైపే సీబీఐ చూస్తోందని, రెండో వైపు చూడట్లేదని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. పైగా సీబీఐ బయటి వ్యక్తుల ప్రభావాలకు గురవుతోందని చెప్పారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

సీబీఐ విచారణను వీడియోగ్రఫీ తీయాలని, తనతో పాటు న్యాయవాదిని విచారణకు అనుమతించాలని అవినాశ్ రెడ్డి హైకోర్టును కోరారు. అలాగే.. తనపై కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఒక దఫా వెసులుబాటు ఇచ్చిన తర్వాత మరోసారి రిలాక్సేషన్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలన్న అవినాశ్ రెడ్డి విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. అంతేకాక, న్యాయవాదిని కూడా అనుమతించలేమని స్పష్టం చేసింది. అయితే విచారణను ఆడియో, వీడియో రికార్డు తీసేందుకు మాత్రం ఓకే చెప్పింది. హైకోర్టు నిర్ణయం అవినాశ్ రెడ్డికి గట్టి ఎదురు దెబ్బే.

కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేయడంతో అవినాశ్ రెడ్డి అరెస్టు ఖాయమని అర్థమవుతోంది. అవినాశ్ రెడ్డి భయం కూడా ఇదే. హైకోర్టు సీబీఐకి క్లారిటీ ఇవ్వడంతో తదుపరి విచారణలో అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాస్తవానికి 11నే అవినాశ్ రెడ్డిని అరెస్టు చేస్తారని భావించారు. అయితే హైకోర్టు సూచన మేరకు అది వాయిదా పడిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు హైకోర్టు క్లారిటీ ఇవ్వడంతో సీబీఐకి అడ్డంకులు తొలగిపోయాయి.

వివేకా హత్య కేసు ప్రస్తుతం అవినాశ్ రెడ్డి ఫ్యామిలీ చుట్టూ తిరుగుతోంది. అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లందరినీ సీబీఐ విచారణ జరిపింది. కొందరు అప్రూవర్లుగా కూడా మారిపోయారు. అన్ని చేతులూ అవినాశ్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. అందుకే అవినాశ్ రెడ్డి అరెస్టు రేపో మాపో ఖాయమని ఇప్పుడు తేలిపోయింది.

 

 

Tags :