రివ్యూ : ఫామిలీ ఎంటర్ టైనర్ 'టక్ జగదీష్'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థ : షైన్ స్క్రీన్స్ బ్యానర్
నటీనటులు : నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్, నాజర్, జగపతి బాబు, రావు రమేశ్, నరేశ్, డేనియల్ బాలాజీ, తిరువీర్, జయ ప్రకాష్ నారాయణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అడ్డుకాలం నరేన్, పార్వతి, రోహిణి, దేవదర్శి, వైష్ణవి చైతన్య, బిందు చంద్రమౌలి , ప్రవీణ్, రఘు బాబు, సి వి యల్ నరసింహ రావు , రామ రాజు, శశిధర్ తదితరులు నటించారు.
సంగీతం : తమన్, పాటలు: సిరి వెన్నెల సీతారామ శాస్ట్రీ, కల్యాణ చక్రవర్తి, చైతన్య ప్రసాద్, శివ నిర్వాణ, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మురెళ్ళ. ఎడిటర్: ప్రవీణ్ పూడి, నేపథ్య సంగీతం: గోపీసుందర్, ఓటిటి :అమెజాన్ ప్రైమ్ వీడియో
నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది
కథ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం : శివ నిర్వాణ
విడుదల తేది : 10. 09. 2021
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ... తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసే టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తుంపు తెచ్చుకున్నాడు నేచురల్ స్టార్ నాని. తొలి సినిమా 'అష్టా చమ్మా' మొదలు గత ఏడాదిలో విడుదలైన ‘వి’వరకు ప్రతి సినిమాలోనూ కొత్తదనం, కొత్త తరహా పాత్రలు పోషిస్తూ, తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. గతేడాది ‘వి’ ఓటీటీలో సందడి చేసింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ థియేటర్ యాజమాన్యం వ్యతిరేకత తో ‘టక్ జగదీష్’ కూడా ఓటీటీ లో విడుదల అనివార్యమైంది. నేచురల్ స్టార్ నటించిన తాజా చిత్రం ‘టక్ జగదీష్’. తరచూ ప్రేమ కథా చిత్రాలతో అలరించే నాని.. తొలిసారి తెలుగింటి కుటుంబ కథను ఎంచుకున్నాడు. నానికి ‘నిన్నుకోరి’ లాంటి సూపర్ హిట్ అందించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు వినాయకచవితి సందర్భంగా శుక్రవారం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. . టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ఈ ‘టక్ జగదీష్’ ఏ మేరకు అందుకున్నాడో రివ్యూలో చూద్దాం.
కథ:
భూదేవిపురంలో ఆదిశేషులు నాయుడు(నాజర్) పెద్ద భూస్వామి. కక్షలు, కార్పణ్యాలు లేని గ్రామాన్ని చూడాలని ఆశిస్తుంటాడు. ప్రజలకు సాయం చేస్తూ అందరి తలలో నాలుకలా ఉంటాడు. ఆదిశేషులు నాయుడికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు బోసుబాబు(జగపతిబాబు) తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు. చిన్న కొడుకు టక్ జగదీష్(నాని) పట్టణంలో చదుకుంటూ అప్పుడప్పుడు ఊరికి వస్తుంటాడు. ముఖ్యంగా మేనకోడలు చంద్రమ్మ(ఐశ్వర్య రాజేష్)అంటే జగదీష్‌కి ప్రాణం. తన తండ్రి ఆదిశేషు హఠాన్మరణం చెందడంతో ఇంటి బాధ్యలతను అన్నయ్య బోసుకి అప్పగించి పై చదువుల కోసం పట్నానికి వెళ్తాడు జగదీష్. అయితే తనకు తెలియకుండా తన ప్రత్యర్థి వీరేంద్రనాయుడు(డానియల్ బాలాజీ) తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కుటుంబ సభ్యులు. విషయం తెలుసకోని జగదీష్ గ్రామానికి వస్తాడు. ఈ లోగా తన కుటుంబంలో సమస్యలు వచ్చి అందరూ విడిపోతారు. గ్రామ ప్రజలు కూడా జగదీష్ కుటుంబంపై ద్వేషం పెంచుకుంటారు. అసలు తన కుటుంబాన్ని ఆ ఊరి ప్రజలు ఎందుకు ద్వేషిస్తున్నారు? అమితంగా ఇష్టపడే మేన కోడలు పెళ్లి జగదీష్‌కు తెలియకుండా ఎవరితో, ఎందుకు చేశారు? పదిమందికి ఆదర్శంగా ఉండే ఆదిశేషు కుటుంబంలో వచ్చిన సమస్య ఏంటి? దాన్ని జగదీష్ ఎలా పరిష్కరించాడు? ఇందులో మెయిన్ హీరోయిన్ రీతు వర్మ పాత్ర ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటి నటుల హావభావాలు:
ఎప్పటి మాదిరే నాని తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. తన హావభావాలతో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయగల నటుడు నాని. జగదీష్ నాయుడు అనే బరువైన పాత్రని అవలీలగా పోషించేశాడు. ముఖ్యంగా ఎమ్మార్వో జగదీష్ నాయుడిగా అదరగొట్టేశాడు. హీరో అన్నయ్య బోసు పాత్రలో జగపతి బాబు జీవించేశాడు. చాలా కాలం తర్వాత జగపతి బాబు అన్నయ్య పాత్రను పోషంచి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో తండ్రి ఆదిశేషు నాయుడిగా నాజర్ తనదైన నటనతో మెప్పించాడు. వీఆర్వో గుమ్మడి వరలక్ష్మీ పాత్రలో రీతూవర్మ చక్కగా ఒదిగిపోయింది. హీరో మేనకోడలు చంద్ర పాత్రలో ఐశ్యర్య రాజేశ్ పర్వాలేదనిపించింది. అలాగే రావు రమేశ్, నరేశ్, మాలపార్వతి, రోహిని, దేవదర్శిని తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి భావోద్వేగభరిత ప్రేమకథా చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు శివ నిర్వాణ. గ్రామీణ నేపథ్యంలో ఉమ్మడి కుటుంబం కథతో తెరకెక్కిన చిత్రమే ‘టక్ జగదీష్’. కుటుంబం, ఆస్తి తగాదాలు, ఊర్లో భూ గొడవలు కళ్లకు కట్టినట్లు చూపించాడు. అయితే ఇలాంటి నేపథ్యం ఉన్న చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. టక్ జగదీష్‌లో కొత్తగా చూపించిదేమి లేదు. తమన్ అందించిన పాటల్లో ఒకట్రెండు బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్కూడా అందంగా ఉంది. ‘ఏటికొక్క పూట’ పాట నేపథ్యంతో సాగే ఫైట్ సీన్ బాగుంది. గోపీ సుందర్ నేపథ్య సంగీతం ఓకే. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పర్వాలేదు. పైగా మేనకోడలు బాధ్యత, ఎమ్మార్వో ఉద్యోగం, హీరోకి ఓ ప్రేమ కథ.. అంటూ చాలా పెద్ద స్క్రిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు. రెండున్నర గంటల్లో ఇంత పెద్ద కథను తెరపై చూపించడం కొంచెం కష్టమే. అయినప్పటికీ.. కథలోని ప్రతి పాత్రకు ఓ జస్టిఫికేష్ ఇస్తూ చాలా క్లారిటీగా చేప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఫ్యామిలీ ఒరియెంటెడ్ సినిమాగా తెరకెక్కించడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడనే చెప్పాలి. కానీ కమర్షియల్ కంటెంట్ లేకపోవడం సినిమాకు కాస్త మైనస్. శివ మెరుపు సంభాషణలు బాగున్నాయి. నిర్మాణ విలువలు ఓకే!
విశ్లేషణ:
భూదేవిపురంలో జరిగే గొడవలతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఆయా సన్నివేశాలన్నీ గతంలో మనం చాలా సినిమాల్లో చూశాం. ఇందులో నటులు మారారంతే. టక్ జగదీష్ రాకతో కథ మలుపు తిరుగుతుందనుకుంటే ఫ్యామిలీ డ్రామాతో సన్నివేశాలు నడిపించాడు. కథనం కూడా చాలా నెమ్మదిగా సాగుతుంది. ఆది శేషులునాయుడు చనిపోయే వరకూ ఫక్తు ఫ్యామిలీ డ్రామా తెరపై కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆస్తికోసం బోసు అడ్డం తిరగడం, జగదీష్ సర్ది చెప్పే ప్రయత్నం చేయడం వంటి సన్నివేశాలతో కథలో వేగం పెరుగుతుంది. కథానాయకుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడన్న ఆసక్తి మొదలవుతుంది. సరిగ్గా విరామ సన్నివేశాలకు దర్శకుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటో తెరపై చూస్తే ఆసక్తిగా ఉంటుంది. టక్ జగదీష్ మళ్లీ భూదేవిపురంలోకి అడుగు పెట్టిన తర్వాత కథ, కథనాలు వేగం పుంజుకుంటాయి. ఊళ్లో ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ తన తండ్రి మాటను నిలబెట్టేందుకు జగదీష్ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో వీరేంద్రనాయుడు నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాడు. దర్శకుడు ఆ టెంపోను చివరి వరకూ కొనసాగించి ఉంటే బాగుండేది. ప్రీక్లైమాక్స్‌కు మళ్లీ ఫ్యామిలీ డ్రామాను తీసుకొచ్చాడు. దీంతో పతాక సన్నివేశాలు ఊహకు తగినట్లుగానే సాగుతాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో రావడం ప్లస్ పాయింటనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఫ్యామిలీ డ్రామాలు వచ్చి చాలా కాలమైంది. పైగా ఓటీటీలో సినిమా అందుబాటులో ఉండడం.. ‘టక్ జగదీష్’కి కలిసొస్తుందనే చెప్పొచ్చు.