ఎలాన్ మస్క్ ఆఫర్‌కు ... ట్విటర్ బోర్డ్ మద్దతు

ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్‌కు ట్విటర్ బోర్డు మద్దతు ప్రకటించింది. ఈ డీల్‌కు ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలంటూ షేర్ హోల్డర్లకు సిఫార్సు చేసినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. ట్విటర్లో వాటాదారు కూడా అయిన ఎలాన్ మస్క్ షేరు ఒక్కింటికి 54.20 డాలర్ల చొప్పున లెక్కగట్టి మొత్తం కంపెనీని 44 బిలియన్డాలర్లకు కొనుగోలు చేస్తానంటూ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మైక్రోబ్లాగింగ్ సైట్‌లోని నకిలీ ఖాతాల నిగ్గుతేలితేనే ముందుకెళతానంటూ ఆయన ఆ తర్వాత ప్రకటించారు. ఇలా డీల్ విషయంలో సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో ట్విటర్ షేరు గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం 38.98 డాలర్ల స్థాయిలో ట్విటర్ షేరు తిరుగాడుతోంది. ఒక వేళ ఇప్పుడు గానీ డీల్ కుదుర్చుకుంటే ట్విటర్ ఇన్వెస్టర్లకు ప్రతి షేరుపై దాదాపు 15.22 డాలర్ల మేర లాభం దక్కుతుందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.