ఉక్రెయిన్ లో మరో విషాదం .. మంత్రితో సహా 18 మంది

ఉక్రెయిన్ లో మరో విషాధం చోటు చేసుకుంది. రాజధాని కీవ్ వెలుపల ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలిపోవడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, ఉక్రెయిన్ అంతర్గత మంత్రి డెనిస్ మొనాస్టెర్స్కీ తో సహా 18 మంది మృతి చెందారని ఉక్రెయిన్ పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో అంతర్గత మంత్రిత్వశాఖ చెందిన పలువురు ఉన్నతాధికారులు ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటన కీవ్కి ఈశాన్యంగా సుమారు 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న బ్రోవరీ పట్టణంలోని కిండర్గార్డెన్ సమీపంలో జరిగింది. ప్రస్తుతం ఘటనాస్థలంలో వైద్యులు, పోలీసులు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. ఈ ఘటనలో డెనిస్తో పాటు ఆయన సహాయ మంత్రి యెవ్జెనియ్ యెనిన్ కూడా మరణించినట్లు తెలిపారు. అలాగే 29 మందికి గాయాలైనట్లు, వారిలో 15 మంది పిల్లలు కూడా ఉన్నారనే సమాచారం అందినట్లు కీవ్ రీజియన్ గవర్నర్ తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఘటన గల కారణాలపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు.