రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో ఉద్యమమే

రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో ఉద్యమమే

తెలంగాణలో రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో జరిగేది ఉద్యమమేనని బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ చౌరస్తాకు చేరుకుంది. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రకాష్‌ జవదేకర్‌ మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా పాలన నడవడం లేదని, కేవలం కుటుంబ పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. సీఎం పీఠం ఎక్కగానే కేసీఆర్‌ హామీలను మర్చిపోయారని విమర్శించారు. ఏడేళ్ల పాలనలో ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజల్ని మభ్యపెడుతోన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో అవినీతి అక్రమాల పాలన సాగిస్తున్నారన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రాలకు నిధులు పెంచారని తెలిపారు. తెలంగాణలో హైవేల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. యాత్ర ద్వారా ప్రజా సమస్యలను బండి తెలుసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం బీజేపీదేనని అన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

 

Tags :