MKOne Telugu Times Youtube Channel

రివ్యూ : 'ఉప్పెన' కథ పాతదే కానీ... ట్రీట్ మెంట్ కొత్తగా....

రివ్యూ  : 'ఉప్పెన' కథ పాతదే కానీ...  ట్రీట్ మెంట్ కొత్తగా....

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌
జానర్ : లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా
నటీనటులు : పంజా వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి, విజయ్‌ సేతుపతి, రాజీవ్‌ కనకాల తదితరులు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ : శ్యామ్ దత్, ఎడిటర్‌ : నవీన్‌ నూలి
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, సుకుమార్
దర్శకత్వం : బుచ్చిబాబు సానా
విడుదల తేది : 12. 02. 2021

టాలీవుడ్ లో ‘మెగా’ఫ్యామిలీ ఓ ప్రత్యేకస్థానం ఉంది. ఆ కుటుంబం నుంచి అత్యధికంగా ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వడమే హీరోలుగా తమ స్థానాల్ని పదిలపర్చుకోవడం. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో అబ్బాయి కూడా సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. అతడే..  మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, మెగాస్టార్ చెల్లెలు విజయ ద్వితీయ కుమారుడు సుప్రీం హీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్. ‘మెగా’ ఇమేజ్‌ని మోస్తూ ‘ఉప్పెన’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు వైష్ణవ్ తేజ్. చిరంజీవి కుటుంబం నుంచి మరో వారసుడు వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులకు కూడా ‘ఉప్పెన’పై ఆసక్తి బాగా పెరిగింది. దానికి తోడు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రముఖులు మాట్లాడిన అద్భుతమైన తీరు మైత్రి మూవీ మేకర్స్ భారీతనం, ఇన్ని అంచనాల నడుమ శుక్రవారం ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది? షుమారు 35కోట్లతో నిర్మించిన ఈ చిత్రం  బాక్సాఫీస్ పై విరుచుకుపడబోతుందనా? లేదా? వైష్ణవ్ తేజ్ డెబ్ల్యూ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? అనేది రివ్యూలో చూద్దాం.

కథ :

ఇక కథ విషయానికొస్తే... ఈ టైపు కథలు సినిమా పుట్టిననాటి నుండి ఎన్నో వచ్చాయి అయినా సరే తెలుసుకుందాం. ఆశీ అలియాస్ ఆశీర్వాదం (వైష్ణవ్ తేజ్) ఒక నిరుపేద మత్స్యకార కుటుంబానికి చెందిన సాధారణ యువకుడు. ఊరు ఉప్పాడ, ఆ  గ్రామంలోని తండ్రి చేసే చేపల వ్యాపారానికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆయనకు గ్రామ పెద్ద, వ్యాపారవేత్త రాయణం (విజయ సేతుపతి) కూతురు బేబమ్మ అలియాస్‌ సంగీత (కృతి శెట్టి) అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి బేబమ్మను ప్రేమిస్తుంటాడు. కానీ ఈ విషయం బేబమ్మకు తెలియదు. మరోవైపు రాయణంకు పరువు అంటే ప్రాణం. పరువు కోసం ఎంతటి దారుణానికికైనా పాల్పడుతాడు. ప్రాణం పోయినా పర్వాలేదు.. పరువు పోకూడదనే మూర్ఖుడు. తన కూతురు ఎక్కడ ప్రేమలో పడి తన పరువు తీస్తుందనే భయంతో కుర్రాళ్ల గాలి తగలకుండా ఉమెన్స్‌ కాలేజీలో జాయిన్‌ చేయిస్తాడు. తన కూతురు కోసం స్పెషల్‌గా గ్రామానికి ఓ బస్సును కూడా వేయిస్తాడు. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల బేబమ్మ.. ఆశీతో ప్రేమలో పడిపోతుంది. ఓ సంఘటన వల్ల రాయణంకు తన కూతురు ప్రేమలో పడిన విషయం తెలుస్తుంది. దీంతో రాయణం ఆశీ గ్రామంపై దాడి చేయిస్తాడు. పరువు కోసం ప్రాణాలు ఇచ్చే రాయణం.. తన కూతురి ప్రేమను అంగీకరించాడా లేదా? ప్రేమ దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకు ఈ జంట ఎలా ఒక్కటైందనేదే మిగతా కథ.

నటి నటుల హావభావాలు :

ఇక నటీనటుల విషయానికి వస్తే ఏ ఒక్కరూ కూడా ఎక్కడా తగ్గలేదని చెప్పాలి చిరంజీవి శంకర్ దాదా,  పవన్‌ కల్యాణ్ జానీ   సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన వైష్ణవ్ తేజ్‌కు హీరోగా తొలి సినిమా ఇది. కానీ సగటు ప్రేక్షకుడు వైష్ణవ్‌కు ఇది తొలి సినిమా అని గుర్తుపట్టలేరు. అంత అనుభవం వున్నా నటుడిగా నటించాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌. ఆశీ అనే ఓ పేదింటి కుర్రాడి క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. మొదటి సినిమానే అయినా హీరో ఎంతో పరిణితితో నటించాడు. ఎమోషనల్‌ సీన్లను అవలీలగా చేసేశాడు. అతని కళ్ళలోని తీక్షణత పండించిన ఎమోషన్స్ అమోఘం. ఇక బేబమ్మ పాత్రకు ప్రాణం పోసింది కృతి శెట్టి. తొలి సినిమాయే అయినా.. చాలా అనుభవం ఉన్న హీరోయిన్‌లా నటించింది. ఇక వైష్ణవ్‌ తేజ్‌ తర్వాత మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో బాగా నటించిన నటుడు. రాయాణం అనే విలన్‌ పాత్రలో ఈ విలక్షణ నటుడు ఇన్ వాల్వ్ అయిపోయాడు. సేతుపతి యాక్టింగ్ ఈ సినిమాకె పెద్ద హైలెట్ గా చెప్పొచ్చు. ఇక మిగతా నటులు వారి వారి పాత్రలలో మెప్పించారు. 

సాంకేతిక వర్గం పనితీరు :

దర్శకుడు బుచ్చిబాబు సన విషయానికి వస్తే తన ఈ డెబ్యూ చిత్రంతో ఇంప్రెస్ చేశారనే చెప్పాలి. కాస్త పాత రొటీన్ లైన్ నే ఎంచుకున్నా దానిని ఆసక్తికరంగా మలచడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మంచి కథనం, స్రీన్ ప్లే రాసుకున్నారు. అలాగే నటీనటుల నుంచి మంచి అవుట్ ఫుట్ ను రాబట్టుకొని తన మొదటి సినిమాకే మంచి మార్కులు వేసుకున్నారు. కొన్ని సీన్స్ బాగానే రాసుకున్నా సెకండాఫ్ ను ఇంకా బలంగా మంచి గ్రిప్పింగ్ తో తెరకెక్కించి ఖచ్చితంగా ఈ చిత్రం మరో స్థాయిలో ఉండేది.  దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం ఈ సినిమాను చాలా మేర నెట్టుకొచ్చేయడానికి ఆయువు పట్టులా నిలుస్తుంది. దేవిశ్రీ ప్రాసాద్‌ సంగీతం, తనదైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సినిమా రేంజ్‌ని అమాంతం పెంచేశాడు. విలన్‌కు సంబంధించిన కొన్ని సీన్లకు తన బీజీయంతో ప్రాణం పోశాడు. ఇక అలాగే ఈ సినిమాలో డైలాగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా సేతుపతికి రాసిన ప్రతీ డైలాగ్ కూడా అర్ధవంతంగా ఉంటుంది.  ఎడిటింగ్ బాగుంది, కాస్ట్యూమ్ వర్క్స్ అన్ని బాగున్నాయి. శ్యామ్ దత్ విజువల్స్‌ బాగున్నాయి. నవీనూలి ఎడిటింగ్‌ పర్వాలేదు. సెకాండాఫ్‌లో కొన్ని చోట్లు తన కత్తెరకు పని చెప్పాల్సింది. ప్రతీ ఫ్రేమ్ లో కూడా అత్యున్నత నిర్మాణ విలువలు కనిపిస్తాయి.

విశ్లేషణ :

గొప్పా, పేద పరువు, ప్రతిష్ట ల ప్రేమతో కూడిని సినిమాలు టాలీవుడ్‌లో చాలా వచ్చాయి. గొప్పింటి అమ్మాయిని పేదింటి అబ్బాయి ప్రేమించడం, పరువు కోసం ఆ ప్రేమకు హీరోయిన్‌ నాన్న అడ్డుపడడం. చివరకు ఎలాగోలా హీరో హీరోయిన్లు ఒక్కడవ్వడంతో. ఇలాంటి సినిమాలు సర్వసాధారణం కూడా. ఈ కథనే కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు బుచ్చిబాబు. విజయసేతుపతి లాంటి విలక్షణ నటుడిని, మెగా కుటుంబం నుంచి ఓ హీరోని తన కథకు సెలెక్ట్‌ చేసుకోవడంలోనే దర్శకుడు సగం విజయవంతం అయ్యాడని చెప్పొచ్చు. తొలి సినిమా అయినప్పటికీ ఎక్కడా బోర్‌ కొట్టించకుండా సూపర్‌ స్క్రీన్‌ప్లేతో అనుకున్నకథను కళ్లకు కట్టినట్లుగా తెరపై చూపించాడు. తనదైన స్క్రీన్‌ప్లేతో పాత స్టోరీకి ట్రీట్‌మెంట్ కాస్త డిఫరెంట్‌గా ఇచ్చాడు. మొత్తంగా చూసుకున్నట్టయతే మంచి క్యాస్టింగ్ అండ్ అంచనాలతో వచ్చిన ఈ “ఉప్పెన”, నటీనటుల ప్రామిసింగ్ పెరఫామెన్స్ లు, మరో అతి పెద్ద ఎస్సెట్ గా నిలిచే సంగీతం, ఎమోషన్స్ తో చాలా బాగా అనిపిస్తుంది. కానీ రొటీన్ పేద ధనిక కథా నేపథ్యం, సెకండాఫ్ లో ఇంపాక్ట్ తగ్గడం వంటివి కాస్త నిరాశ పరుస్తాయి, కానీ క్లైమాక్స్ మరో స్థాయికి తీసుకెళ్తుంది.  ఓవరాల్ గా ఈ సినిమా చూస్తే నిరాశ పర్చదని చెప్పొచ్చు.  

 

Tags :