సూడాన్ కు అమెరికా భారీ షాక్...

సూడాన్ కు అమెరికా భారీ షాక్...

సూడాన్‌లో తాజాగా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సైన్యం తాత్కాలిక ప్రధాని అబ్దుల్లా హమ్‌డోక్‌ సహా పలువురు అధికారులను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తాజాగా అమెరికా ఈ తిరుగుబాటు చర్యను తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో సుడాన్‌కు 700 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సూడాన్‌ ప్రధానితోపాటు అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది.

దేశంలో ప్రజా అధికారాన్ని పునరుద్దరించాలని సూచించింది. అయితే ప్రస్తుతానికి నిలిపివేసిన 700 మిలియన్‌ డాలర్లతో పాటు సూడాన్‌కు అమెరికా ఎంత సాయం అందచేయనుందో పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ సందర్భంగా అమెరికా అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైసె మాట్లాడుతూ తిరుగుబాటు అనేది సూడాన్‌ పౌరుల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు తూట్లు పొడవడమేనని, దేశ రాజ్యాంగ విధానాలను ఉల్లంఘించడమేని స్పష్టం చేశారు. ఆందోళనకారులపై హింసాత్మక ధోరణి అవలంబించొద్దని, వారిపై ఆయుధాలు ప్రయోగించవద్దని కోరారు. స్థానిక పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, బలవంతంగా ఏది చేసినా అది ఇరు దేశాల మద్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీస్తుందని హెచ్చరించారు.

 

Tags :