అమెరికాలో హిందూ సాంస్కృతిక వారసత్వ మాసంగా అక్టోబర్ నెల

అమెరికాలో హిందూ సాంస్కృతిక వారసత్వ మాసంగా అక్టోబర్ నెల

అక్టోబర్‌ నెలను హిందూ సాంస్కృతిక వారసత్వ మాసంగా గుర్తిస్తున్నట్టు అమెరికాలోని పలు రాష్ట్రాలు తాజాగా ప్రకటించాయి. టెక్సాస్‌, ఫ్లోరిడా, న్యూజెర్సీ, ఓహాయో, మసాచుసెట్స్‌తో పాటు పలు ఇతర రాష్ట్రాల గవర్నర్‌ కార్యాలయాలు ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేశాయి. అమెరికాలో హిందూ సంఘాల కృషి ఫలితంగా ఇది సాధ్యమైంది. ‘‘అమెరికాలో వివిధ మతాలు, సంస్కృతులు శాంతికి చిహ్నాలుగా, ఆశాదీపాలుగా నిలుస్తున్నాయి. ఆయా మతాల వారు తమ సేవల ద్వారా అమెరికా అభ్యున్నతికి తోడ్పడుతున్నారు. ఇక హిందూ మతం సంస్కృతి, చరిత్ర కూడా అమెరికా అభ్యున్నతిలో కీలక పాత్ర పోషించాయి’’ అని ఆయా రాష్ట్రాల గవర్నర్లు, సెనెటర్లు, కాంగ్రెస్‌ సభ్యులు ప్రకటనలో విడుదల చేశారు.

ఇక అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం కూడా ఆక్టోబర్‌ నెలను హిందూ సాంస్కృతిక మాసంగా గుర్తించేలా అక్కడి హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. బైడెన్‌ ప్రభుత్వాన్ని ఈ దిశగా ప్రోత్సహించేలా ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ‘‘హిందూ సంస్కృతి, విలువలపై చాలా తక్కువ మందికి అవగాహన ఉండటమనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచేందుకు, హిందూ సంస్కృతి గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ఇదే మంచి సమయం’’ అని  విశ్వ హిందూ పరిషత్‌ ఆఫ్‌ అమెరికా(వీహెచ్‌పీఏ) అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

 

Tags :