ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం... చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డును

ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం... చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డును

చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డును ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ప్రకటించారు. అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాత చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని  నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. 2019లో మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ హయాంలో చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డును ఏర్పాటు చేశారు. అయితే ఆ బోర్డును రద్దు చేయాలని స్థానిక పూజారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆలయాల సాంప్రదాయ హక్కులు అడ్డుకుంటున్నట్లు వాళ్లు ఆరోపించారు. దేవస్థానం బోర్డుపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి ధామి ఈ నిర్ణయం తీసుకున్నారు.

మనోహర్‌ కంట్‌ దయానీ నేతృత్వంలోని బృందం రిపోర్ట్‌ను తయారు చేసింది. దేవస్థానం బోర్డు కింద 51 ఆలయాల నిర్వహణ ఉండేది. కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, యమునోత్రి, గంగ్రోతి, ఆలయాలు కూడా ఆ బోర్డు పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై చార్‌ధామ్‌ పూజారులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమ నిరంతర ఒత్తిడి ఫలితంగానే ఇది సాధ్యమైనట్లు తెలిపారు. ఇది ఒక చారిత్రక నిర్ణయం. భారత ప్రజాస్వామ్యంలో ఒక అపూర్వ సంఘటన అని చార్‌ధామ్‌ తీర్థ పురోహిత్‌, హక్‌ హకూక్‌దారి మహాపంచాయత్‌ ప్రతినిధి బ్రజేష్‌ సతి అన్నారు.

 

 

Tags :