రివ్యూ: పవర్ స్టార్ పవర్ ఫుల్ ప్యాకెడ్ మూవీ 'వకీల్ సాబ్'

రివ్యూ: పవర్ స్టార్ పవర్ ఫుల్ ప్యాకెడ్ మూవీ 'వకీల్ సాబ్'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3.25/5
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అండ్  బే వ్యూ ప్రాజెక్ట్స్
నటి నటులు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నివేత థామోస్, అంజలి, అనన్య నాగళ్ళ. ప్రకాష్ రాజ్, నరేష్,
ముకేశ్ ఋషి, దేవ్ గిల్, సుబ్బా రాజు, వంశి కృష్ణ, అనసూయ భరద్వాజ్, ఆనంద చక్రపాణి స్పెషల్ అప్పీరెన్స్ గా శృతి హాసన్ నటించారు. 
సంగీతం: ఎస్. థమన్, సినిమాటోగ్రఫీ : పి. ఎస్. వినోద్
ఎడిటర్: ప్రవీణ్ పూడి, పాటలు: రామ్ జోగయ్య శాస్ట్రీ, సుద్దాల అశోక్ తేజ
కథ మూలం: 'పింక్' అనురుద్ధ రాయ్ చౌదరి, సుజిత్ సర్కార్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, బోనీ కపూర్,
మాటలు, దర్శకత్వం: వేణు శ్రీ రామ్
విడుదల తేదీ: 09.04. 2021

2018 సంక్రాంతి కానుకగా వచ్చిన అజ్ఞాతవాసి విడుదలై మూడేళ్లు పూర్తి అయ్యింది. లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తెరపై కనిపిస్తున్న  సినిమా 'వకీల్ సాబ్'. 2016 లో వచ్చిన హిందీ చిత్రం 'పింక్' అమితాబ్ బచ్చన్ తాప్సి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీకి రీమేక్ గా ఈ సినిమాని నిర్మించారు. తెలుగు అభిమానుల అభిరుచికి తగ్గట్టు, పవన్ కళ్యాణ్ కు వుండే స్టయిల్లో  పాత్రని పొడిగించి, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా జత చేసి సరికొత్తగా రూపొందించిన 'వకీల్ సాబ్' బోనీ కపూర్, దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఓ మై ఫ్రెండ్, మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసాడు. మరి పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూ లో చూద్దాం.

కథ:
న్యాయం కోసం  ప్రజల బాగు కోసం  ఏదైనా చేయాలి అని ఆరాటపడే యువకుడు  కొణిదెల సత్యదేవ్(పవన్ కళ్యాణ్) సామాన్యులకి పూర్తి  న్యాయం జరగాలని న్యాయవాద వృత్తిని ఎంచుకుంటాడు. ఆ తర్వాత లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా తన లాయర్ వృత్తిని వదిలేస్తాడు. అలా వదిలేసి హైదరాబాద్ లోని ఓ ఏరియాలకు షిఫ్ట్ అవుతాడు. అదే ఏరియాలో ఉంటున్న జరీనా (అంజలి), వేముల పల్లవి  (నివేత థామస్) మరియు దివ్య (అనన్య)లు. లైంగిక వేధింపులు జరిపిన  ఎంపీ కొడుకు వంశీ (వంశీ కృష్ణ) అండ్ స్నేహితులను వేముల పల్లవి బాటిల్ తో  కొట్టి పారిపోయిన కేసులో పల్లవి ని జైల్లో పెడతారు. ఎంపీ తన పలుకుబడితో పల్లవికి బెయిల్ రాకుండా చేస్తుంటాడు. జరీనా వాళ్ళ కేసు ఎఫ్.ఐ.ఆర్ చూసిన సత్యదేవ్ వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చి హెల్ప్ చేస్తాడు. అది తెలుసుకున్న ఎంపీ ఆ ముగ్గురు అమ్మాయిలకి హెల్ప్ చేస్తున్నాడని తెలిసి సత్యదేవ్ ని భయపెట్టాలనుకుంటాడు. ఈ నేపధ్యం లో సీరియస్ అయిన సత్యదేవ్ ఆ కేసుని టేకప్ చేస్తాడు. ఇక కోర్టులో నంద(ప్రకాష్ రాజ్)తో పోటా పోటీగా వాదించి తన క్లైంట్ పల్లవిని సేవ్ చేశాడా? లేదా? అసలు ఏయే కేసుల్లో నివేత, అంజలి, అనన్యలను ఇరికించారు? అసలు సత్యదేవ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఎందుకు తనకి ఇష్టమైన న్యాయవాది వృత్తిని వదిలేసాడు? ఏ సంబంధం లేని ఆ ముగ్గురు అమ్మాయిల కోసం ఎందుకు స్టాండ్ తీసుకున్నాడు అన్నదే మిగతా కథ.

నటి నటుల హావభావాలు:
ఈ సినిమాకు వన్ అండ్ ఓన్లీ  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నట విశ్వరూపమే. వకీల్ సాబ్ పాత్రలో పవన్ పరకాయ ప్రవేశం చేశారు. ప్రత్యేకించి కోర్టు సన్నివేశాల్లో ప్రధానమైన కొన్ని హావభావాలను, పవన్ తన ముఖ కవళికల్లో పలికించిన విధానం ఫ్యాన్స్ తో పాటు సగటు  ప్రేక్షకులను కూడా అబ్బుర పరుస్తోంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీలో కూడా పవన్ కొత్తగా కనిపించాడు. ఇక శృతిహాసన్ చనిపోయిన సీన్ లో అలాగే కోర్టులో...  ఎమోషనల్ గా సాగే కన్నీళ్ళు పెట్టే సన్నివేశంలో పవన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణ. అన్యాయాన్ని ఎదిరించే వ‌కీల్ సాబ్ గా పవన్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చారు. అలాగే పవన్ చెప్పిన కొన్ని పవర్ ఫుల్  డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక బాధిత యువ‌తులుగా అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య తమ పాత్రల్లో అద్భుతంగా న‌టించారు. ముఖ్యంగా నివేదా నటన పరిణితి గా వుంది.  ఇక క్రిమిన‌ల్ లాయ‌ర్ గా ప్ర‌కాష్ రాజ్ ఎప్పటిలాగే తన పాత్రలో చెల‌రేగిపోయారు. గెస్ట్ రోల్ లాంటి హీరోయిన్ పాత్రలో శృతిహాస‌న్ ఆక‌ట్టుకుంది. ఆమెకు సూప‌ర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బాగానే చేసింది. ఇక మిగతా నటి నటులు తమ తమ పాత్రలలో బాగానే నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు వేణు శ్రీ రామ్ కంటెంట్ బేస్డ్ స్టోరీలో హీరోయిజమ్ పెట్టి సినిమా స్థాయిని పెంచాడు. ఒరిజినల్ కథకి ఏ మాత్రం డామేజ్ కలగకుండా పవన్ కళ్యాణ్ పాత్రని ఎస్టాబ్లిష్ చేసిన విధానం చాలా బాగుంది. ఈ విషయంలో అతన్ని మెచ్చుకొని తీరాలి. కథనం పరంగా ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ కలిగినా సెకండాఫ్ మొదలయ్యాక ఇక అన్నీ మర్చిపోయేలా చేశారు. అలాగే ట్రీట్మెంట్ విషయంలో పవన్ ను చూపించే విధానంలో కూడా చాలా వరకు విజయం సాధించాడు. ముఖ్యంగా కోర్టులో జరిగిన కొన్ని నాటకీయ అంశాలనూ, సమాజంలో స్త్రీల పై కొన్ని సందర్భాల్లో జరుగుతున్న వాస్తవిక పరిస్థితులను వేణు చాలా ఆసక్తికరంగా చూపించాడు. తన  అభిమాన హీరో పవన్ కళ్యాణ్ సినిమాకి మ్యూజిక్ చేయడం కోసం ఎదురుచూస్తున్న థమన్ కి వకీల్ సాబ్ కి అవకాశం వచ్చింది. పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలుసు, కానీ సినిమా చూసాక పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాడు. ప్రతి సీన్ ని మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా బాగుంది. దిల్ రాజు శిరీష్ బోనీ కపూర్ ల నిర్మాణపు విలువలు బాగున్నాయి. 

విశ్లేషణ:
పేదలకు న్యాయం చేయడానికే వకీల్ సాబ్ గా మారి.. న్యాయం చేయడం కోసం ఎవర్ని వదలడు అంటూ వచ్చిన ఈ చిత్రం చాలా బాగుంది. మునుపెన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసాడు. ఇక పెర్ ఫార్ మెన్స్ పరంగా అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల పెర్ఫార్మన్స్ అంతా ఒక ఎత్తైతే వకీల్ సాబ్ లో ఆయన చేసిన మెచ్యూర్ పెర్ ఫార్ మెన్స్ సింప్లీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పచ్చు. అటు ఎమోషనల్ సీన్స్, కాలేజ్ ఎపిసోడ్స్, కోర్టులో సీరియస్ గా ఉంటూనే హృద్యంగా వేసిన సెటైర్స్ ఇలా అన్నీ షేడ్స్ ఆడియన్స్ ని థ్రిల్స్ చేస్తాయి.  మూడేళ్ళుగా ఆకలి మీదున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి 'వకీల్ సాబ్' ఓ అద్భుతమైన వింధు భోజనం లా వుంది. మెయిన్ గా సినిమాలో పవన్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. అలాగే మంచి మెసేజ్ తో పాటు ఇంట్రస్ట్ గా సాగే హీరో క్యారెక్టరైజేషన్ మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ సినిమాలో చాలా బాగున్నాయి. కాకపోతే లవ్ స్టోరీ స్లోగా సాగడం, అక్కడక్కడ కొన్ని సీన్స్ కూడా స్లోగా ఉన్నా.. ఓవరాల్ గా ఆడియన్స్ ను మాత్రం ఈ సినిమా బాగా అకట్టుకుంటుంది. 

 

Tags :