ఎం.ఎ తెలుగు విద్యార్థిగా.... తెలుగు భాషాభిమాని వంగూరి చిట్టెం రాజు

ఎం.ఎ తెలుగు విద్యార్థిగా.... తెలుగు భాషాభిమాని వంగూరి చిట్టెం రాజు

అమెరికాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి ముఖ్యంగా భాషాభిమానులకు శ్రీ వంగూరి చిట్టెంరాజు బాగా తెలిసిన తెలుగు ప్రముఖులు. ఆయన ఇప్పుడు 76 ఏళ్ల వయసులో సిలికానాంధ్ర విశ్వ విద్యాలయం లో M.A తెలుగు కోర్స్‌ లో చేరాలని నిర్ణయించుకొని అందరిని ఆశ్చర్య పరిచారు.

శ్రీ చిట్టెంరాజు గారికి తెలుగు టైమ్స్‌ అభినందనలు.  ఈ విషయం.. ఆయన మాట గా తెలుసుకొందాం.

‘‘ఉన్నమాట చెప్పాలంటే...ఎప్పుడో 60 ఏళ్ళ క్రితం కాకినాడలో గాంధీ నగరంలో ఉన్న పురపాలక ఉన్నత పాఠశాలలోనూ, ఆ తర్వాత కేవలం ఒకే ఒక సంవత్సర కాలం మా పి.ఆర్‌. కాలేజీలో పి యు.సి లోనూ మాత్రమే నేను తెలుగు ఒక పాఠ్యాంశంగా చదువుకున్నాను. అంతే..ఆ తర్వాత ఇంజనీరింగ్‌ విద్యాభ్యాసం, ఉద్యోగాలూ అన్నీ అంతా ఆంగ్ల మయమే. అంచేత నాకు తెలిసిన తెలుగు భాష, భాషా శాస్త్రం అంతంత మాత్రమే. ఏదో కాస్తో, కూస్తో ఉన్న పరిజ్ణానంతో వందో, రెండు వందలో కథలూ, వ్యాసాలూ వ్రాసి జనాల మీదకి వదిలేసినంత మాత్రాన నాకు తెలుగు భాష బాగా వచ్చును సుమా అని నేను ఏనాడూ అనుకోలేదు. అలా ప్రచారం చేసుకోనూ లేదు. నాకు ఎంత తెలియదో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నాకు ఎంతో ఆత్మీయులైన సిలికానాంధ్రా నిర్వాహకులు అందరూ..ముఖ్యంగా డా. కూచిభొట్ల ఆనందుడూ, చమర్తి రాజూ మొదలైన అనేక మంది ఆత్మీయ మిత్రులు తెలుగు భాషా, సాంస్కృతిక తపస్సంపనులు. వారందరూ సమిష్టి కృషితో మన కూచిపూడి, భరతనాట్యం, శాస్త్రీయ కర్ణాటక సంగీతాలతో పాటు సంస్కృతమే కాక  మన తెలుగు భాషలో ఒక సర్టిఫికేట్‌ మరియు M.A Degree కూడా అమెరికాలో అందరికీ అందుబాటులోకి తెచ్చారు. అది చూడగానే నా గుండెకాయ రెండు సార్లు టక టకా  కొట్టుకుంది. మొదటి టకటకా.. శభాష్‌... ఎందుకంటే చరిత్రలో వేల సంవత్సరాల క్రితం  తక్షశిల విశ్వవిద్యాలయానికి ప్రపంచంలో అన్నీ దేశాల నుంచీ విద్యార్ధులు తరలి వచ్చినట్టే రాబోయే తరాల వారు సిలికానాంధ్రా విశ్వవిద్యాలయంలో తెలుగు, సంస్కృతం నేర్చుకుంటారు... దానికి...శభాష్‌ అనేది నా మొదటి స్పందన. 

తొలి తరం విద్యార్ధిగా ఆ పని నేనే ఎందుకు చెయ్యకూడదూ అనేది నా రెండో టకటకా... అవును...నాకిప్పుడు ఆఫ్టరాల్‌ 76 ఏళ్ళు...అయితే ఏమిటిటా? తెలుగు నేర్చుకోడానికి అదేమన్నా ఇబ్బందా? 

అంతే...వెనువెంటనే ఇప్పటికైనా తెలుగు భాష నేర్చుకుందాం అనే కుతూహలంతో తెలుగులో M.A Degree లో చేరడం కోసం సిలికానాంధ్రా విశ్వవిద్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాను. వారు పెట్టిన Entrance Examination లో అత్తిసరు మార్కులతో ఉత్తీర్ణుడిని అయ్యాను. చెప్పానుగా. నేను తెలుగు చదువుకుని 60 ఏళ్ళు దాటింది. అసలు ఈ ప్రవేశ పరీక్షలో నెగ్గుతాను అని అనుకోలేదు. 

అసలు విషయం....అనగా మీలో ఆసక్తి, శక్తీ ఉన్నవారికి నా సలహా ఏమిటంటే.....

మీలో ఎవరైనా తెలుగు నేర్చుకుందాం అనుకుంటీ....లేదా  మీకు తెలిసిన తెలుగు భాషకి మెరుపులు దిద్దుకుందాం అనుకుంటే నా క్లాస్‌ లో చేరండి. M.A (తెలుగు).. వయస్సుతో నిమిత్తం లేదు. సరదాగా కలిసి తెలుగు నేర్చుకుందాం.  క్లాసులు ఈ నెలాఖరున మొదలవుతాయి. మీరు పరీక్ష వ్రాసి, నమోదు చేసుకోడానికి ఇంకా సమయం ఉంది. అవసరం అయిన వారికి ట్యూషన్‌ ఫీజు తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి. 

సిలికానాంధ్రా విశ్వవిద్యాలయంలో చేరడానికి లింక్‌ ఈ క్రింద ఇచ్చాను. 

https://www.universityofsiliconandhra.org/school-of-languages-telugu

తెలుగు ఇంకా బాగా నేర్చుకోవాలి అనే సరదా ఉంది..అలాగే కూచిపూడి అన్నా సరదాయే కానీ, జనం చూడలేరు కదా....అంచేత అది నేర్చుకునే ప్రయత్నం మటుకు చెయ్యదల్చుకో లేదు....ప్రస్తుతానికి.  

భవదీయుడు,
వంగూరి చిట్టెన్‌ రాజు

 

Tags :