నాటకాలను కాపాడుకోవాలి... వెంకయ్యనాయుడు

నాటకాలను కాపాడుకోవాలి... వెంకయ్యనాయుడు

భారతీయ కళారంగంలో నాటకాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, సమాజంలోని పరిస్థితులను, వాస్తవ స్థితిగతులను ప్రతిబింబి స్తాయని, అలాంటి నాటకాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని భారత ఉప రాష్ట్రపతి ముప్ప వరపు వెంకయ్యనాయుడు అన్నారు. సినిమా రంగంతో సమానంగా నాటక రంగానికి ప్రాధాన్యత పెరగాలని సూచించారు.

హైదరాబాద్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ సమావేశ మందిరంలో జరిగిన ‘నాటక సాహిత్యోత్సవం’ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి పాల్గొన్నారు. అరవింద ఆర్ట్స్‌, తానా ప్రచురణల ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో నిర్వహిస్తున్న నాటక సాహిత్యోత్సవంలో 1880 నుంచి 2020 మధ్య కాలంలో వచ్చిన వంద ప్రసిద్ధ తెలుగు నాటకాలతో కూడిన ఆరు సంకలనాలను ఆయన ఆవిష్కరించారు.  సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా తెలుగు రంగస్థలం మహోద్యమమే చేసిందని  కొనియాడారు. భారతీయ సమాజాన్ని పట్టిపీడిస్తున్న పలు జాడ్యాలను అనేక నాటకాలు ఎండగట్టాయని శ్లాఘించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నాటకం సినిమాతో పోటీపడాలని ఆకాంక్షించారు. తనకు నాటకాలంటే చాలా ఇష్టం అని, అయితే రాజకీయరంగంలో వస్తున్న కొత్త నాటకాలు కాదని ఛలోక్తి విసిరారు.       

సమాజంపై ప్రభావం చూపించడంలో నాటకాల పాత్ర కీలకమని ఉప రాష్ట్రపతి చెప్పారు. భాష ఉన్నతికి చిరునామాగా ఉంటూ, సామాజిక హితాన్ని కాంక్షిస్తూ, ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచే నాటకాలకు పూర్వ వైభవం రావాలని ఆకాంక్షించారు. సినిమా వచ్చాక నాటకం బలహీన పడిరదని చాలామంది అంటుంటారని కానీ తాను ఆ వాదనతో ఏకీభవించడం లేదని చెప్పారు. సినిమాతో సమానంగా నాటకాన్ని, దాని ప్రాధాన్యతను నిలబెట్టుకోవాలనేదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ప్రభుత్వాలే కాకుండా, ప్రైవేట్‌ సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు నాటక రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు ముందుకు రావాలని వెంకయ్య కోరారు. ప్రైవేట్‌ టీవీ ఛానెళ్ళు నాటకాలకు ప్రోత్సాహం అందించే ప్రయత్నాలు చేయాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల పిల్లలకు విద్యతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాల దిశగా ప్రోత్సాహం అందించాలన్నారు. కోవిడ్‌ సమయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో నాటక కళాకారుల పాత్రను అభినందించారు.

తెలుగు నాటకరంగానికి జాతీయస్థాయిలో రావలసినంత గుర్తింపు రాలేదని ఏపీ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ విచారం వ్యక్తం చేశారు. తెలుగు భాషకు, సాహిత్యానికి, నాటకరంగానికి ప్రభుత్వంతోపాటు ఇతర సంస్థలు కూడా ముందుకు వచ్చి ప్రోత్సహించాలని కోరారు. 

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి మాట్లాడుతూ, నాటకరంగాన్ని అందరూ ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు.

తానా వైస్‌ ప్రెసిడెంట్‌ నిరంజన్‌ శృంగవరపు మాట్లాడుతూ, తెలుగు భాషను, తెలుగు కళలను ప్రోత్సహించడంలో తానా ముందుంటుందని చెప్పారు. పాఠశాల ద్వారా అమెరికాలో తెలుగు భాషను చిన్నారులకు నేర్పిస్తున్నామని, అలాగే నాటక కళాకారులను ఆదుకోవడం కోసం కోవిడ్‌ సమయంలో అనేక కార్యక్రమాలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించి ఆదుకున్నామని చెప్పారు. నాటకరంగానికి అవసరమైన చేయూతను ప్రోత్సాహాన్ని తానా ఎల్లప్పుడూ అందిస్తుందని తెలిపారు.  

సభలో ఆంధ్రనాటక కళాపరిషత్‌ అధ్యక్షుడు బొల్లినేని కృష్ణయ్య, రంగస్థల నిపుణులు వల్లూరి శివప్రసాద్‌, గంగోత్రి సాయి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి మాట్లాడుతూ, ఏపీ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌, ఆంధ్ర నాటక కళా పరిషత్‌ అధ్యక్షులు బొల్లినేని కృష్ణయ్య, తెలుగు ప్రసిద్ధ నాటకాలు సంకలనాల సంపాద కులు వల్లూరి శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

Tags :