రాజ్యసభలో వెంకయ్య నాయుడికి వీడ్కోలు

రాజ్యసభలో వెంకయ్య నాయుడికి వీడ్కోలు

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అత్యంత జనాదరణ ఉన్న నాయకుడని, అనేక బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఈ నెల 10న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభలో నిర్వహించిన వీడ్కోలు సమాశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు వెంకయ్య నాయుడికి అభినందనలు తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన బీజేపీ అధ్యక్షుడు సహా అనేక పదవులు చేపట్టారని కొనియాడారు. యువ ఎంపీలను వెంకయ్య నాయుడు ప్రోత్సహించారని గుర్తు చేశారు. వెంకయ్య నాయుడు కొత్తతరంతో మమేకమయ్యారని పేర్కొన్నారు. ఆయన వాక్‌చాతుర్యం అందరికీ తెలిసిందేనన్నారు. భావితరాలకు వెంకయ్య ఆదర్శమని అన్నారు.

వెంకయ్య మాటల్లో వ్యంగ్యం, గంభీరత ఉంటుందని పేర్కొన్నారు. చైర్మన్‌ హోదాలో విజయవంతంగా రాజ్యసభను నడిపించారని ప్రశంసించారు. పెద్దల సభ గౌరవ మర్యాదలను మరింత పెంచారన్నారు. రాజ్యసభ సచివాలయంలో ఎన్నో మార్పులు తెచ్చారని ప్రస్తావించారు. అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. వెంకయ్య నిబద్ధత స్పూర్తిదాయకమని, ఆయనను చూసి అందరూ నేర్చుకోవాలన్నారు.

 

Tags :