వీక్షణం సాహితీ గవాక్షం - నవమ వార్షికోత్సవం

వీక్షణం సాహితీ గవాక్షం - నవమ వార్షికోత్సవం

కాలిఫోర్నియాలో బే ఏరియాలోని వీక్షణం సాహితీ గవాక్షం 9వ వార్షిక సాహితీ సమావేశం సెప్టెంబరు 11, 2021న ఆన్‌లైన్‌ వేదికగా జరిగింది. ముందుగా వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డా క.గీత మాట్లాడుతూ తొమ్మిదేళ్ల  క్రితం ఒక చిన్న సమావేశంగా మొదలయ్యి ఇంతలోనే 9 సంవత్సరాలు అయ్యిందంటే ఆశ్చర్యంగా ఉందని అంటూ, తమలో సాహితీ స్ఫూర్తిని నిలబెట్టుకుంటూ, ఉచిత, స్వచ్ఛంద వేదికగా సమావేశాల్ని జరపుకుంటూ వస్తున్న ఉన్నతమైన లక్ష్యానికి తనకు తోడ్పడుతున్న వీక్షణం సభ్యులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. వీక్షణం సభ్యులందరికీ వీక్షణమంటే కుటుంబజీవితం తర్వాత అతి ప్రధానంగా మారిన సాహితీ కుటుంబమని అన్నారు. పక్కా కార్యాచరణతో సమావేశాలు నెలనెలా క్రమం తప్పకుండా, ఆసక్తి కోల్పోకుండా నడపడం వెనక ఎడతెగని శ్రమ ఉన్నా అది చక్కని ఆనందాన్నిచ్చే శ్రమ అని,  గొప్ప బాధ్యత ఉన్నా అత్యంత ఆత్మీయమైన బాధ్యత అని అన్నారు. తర్వాత కిరణ్‌ ప్రభ గారు మాట్లాడుతూ వీక్షణం ఎప్పటికీ ఇలాగే ఒక ఆత్మీయ వేదికగా కొనసాగుతుందని, నిరంతర విజయానికి తోడ్పడుతున్న  మిత్రులందరికీ పేరుపేరునా అభివందనాలు తెలియజేసారు.  ఆ తరవాత వీక్షణం ప్రత్యేక సంచికల ఆవిష్కరణ  కిరణ్‌ ప్రభ, కాంతి కిరణ్‌ చేతుల మీదుగా జరిగింది. వీక్షణం ప్రత్యేక సంచికల పరిచయం వేణు ఆసూరి చేశారు. 

తర్వాత సుభాష్‌ పెద్దు  ‘‘ఆమె ఎవరు?’’ అంటూ రవివర్మ చిత్రాలకు ప్రేరణగా నిలిచిన యువతుల గురించి ప్రసంగించగా,  శ్రీచరణ్‌ పాలడుగు ‘‘కిరాతార్జునీయం’’ గురించి సోదాహరణంగా సంగ్రహ ప్రసంగం చేసారు. మంజుల జొన్నలగడ్డ  ‘‘తెలుగు కళాత్మక సినిమా కథల’’ గురించి, వేమూరి వేంకటేశ్వరరావు ‘‘అమెరికా ఆంధ్రులు తెలుగు తల్లికి చేసిన సేవ’’ గురించి, మధు ప్రఖ్యా యండమూరి నవలలు కలిగించిన స్ఫూర్తి  గురించి, టి.పి.ఎన్‌.ఆచార్యులు ‘‘రామాయణ రహస్యాలు’’ అంటూ ఆసక్తిదాయక ప్రసంగాలు చేశారు.    

ఆ తరవాత  శ్రీ రావు తల్లాప్రగడ అధ్యక్ష నిర్వహణలో జరిగిన కవిసమ్మేళనంలో అమెరికా కవులే కాకుండా భారతదేశం నుండి కూడా పాల్గొన్నారు. కవిసమ్మేళనంలో శ్రీచరణ్‌ పాలడుగు, డా కె.గీత, శ్రీధర్‌ రెడ్డి, దాలిరాజు వైశ్యరాజు, డా. బాలకృష్ణారెడ్డి తాటిపర్తి, మధు ప్రఖ్యా, వజ్రాల రాజగోపాల్‌, హరనాథ్‌, రావు తల్లాప్రగడ, మారుతి తన్నీరు, స్వాతి ఆచంట, వరూధిని, పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్‌, టి. పి. ఎన్‌. ఆచార్యులు, డా. గోపాల్‌ నేమన మొదలైనవారు పాల్గొన్నారు.

చివరగా జరిగిన సంగీత విభావరితో వీక్షణం 9వ వార్షిక సాహితీ సమావేశం ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. ఈ సమావేశంలో స్థానిక ప్రముఖులు, సాహిత్యాభిలాషులు విశేషంగా హాజరయ్యి సభని జయప్రదం చేశారు.   

Click here for Event Gallery

 

Tags :
ii). Please add in the header part of the home page.