అర్జున్‌తో వివాదంపై నోరు మెదపని విశ్వక్

కొన్నాళ్ల క్రితం తమిళ్ హీరో, డైరెక్టర్ అర్జున్, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్‌పై మండిపడ్డాడు. అర్జున్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విశ్వక్, షూటింగ్ స్టార్ట్ అయ్యాక షూటింగ్‌ని పోస్ట్‌పోన్ చేద్దామనడంతో అర్జున్ విశ్వక్ పై విరుచుకుపడ్డాడు.
అయితే ఈ విషయంలో విశ్వక్ ఇంతకుముందు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశాడు. స్క్రిప్ట్ విషయంలో శాటిస్‌ఫై అవకపోవడం, అర్జున్‌తో కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చినట్లు విశ్వక్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే విశ్వక్ కొత్త సినిమా ధమ్కీ ప్రమోషన్లలో భాగంగా ఈ విషయమై విశ్వక్ కు ప్రశ్న ఎదురైంది.
అర్జున్ సినిమా నుంచి విశ్వక్ తప్పుకున్నందుకు గానూ చాలా పెద్ద మొత్తంలోనే నష్ట పరిహారం కట్టాల్సి వచ్చినట్లుగా వస్తున్న వార్తలపై మీడియా విశ్వక్ ను ప్రశ్నించగా, ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ఇప్పుడు దాని గురించి తను మాట్లాడాలనుకోవడం లేదనీ, ఎంతోమందిపై ఉన్న గౌరవంతో తను ఆ టాపిక్ గురించి మాట్లాడదలచుకోలేదన్నాడు విశ్వక్.
ఇక ధమ్కీ మూవీకి కూడా పాగల్ డైరెక్టర్ నరేష్ కుప్పిలినే డైరెక్ట్ చేస్తారని చెప్పి, తర్వాత తనని తప్పించడం ఎందుకని ప్రశ్నించగా, ధమ్కీ స్టోరీ నెరేషన్ జరుగుతున్నప్పుడు అతడి శైలికి, తన స్టోరీకి సింక్ కాదనిపించి, ఈ సినిమాను తానే డైరెక్ట్ చేయలనుకున్నట్లు విశ్వక్ చెప్పాడు. నరేష్ తో మరో సినిమా చేస్తానని, తనకి నరేష్ కు మధ్య ఎలాంటి గొడవలు కానీ, వివాదాలు కానీ లేవని క్లారిటీ ఇచ్చాడు విశ్వక్. నరేష్ ను కాదని మరీ తనే డైరెక్ట్ చేసిన ధమ్కీ విశ్వక్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి మరి. మార్చి 22న ధమ్కీ ప్రేక్షకుల ముందుకు రానుంది.