రివ్యూ: మెగా మాస్ ఫీస్ట్ 'వాల్తేరు వీరయ్య'

రివ్యూ: మెగా మాస్ ఫీస్ట్ 'వాల్తేరు వీరయ్య'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్,
నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, క్యాథరిన్, ప్రకాష్ రాజ్, బాబీ సింహా,  ప్రదీప్ రావత్,
సత్యరాజ్, జాన్ విజయ్, నాసర్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి, షకలక శంకర్ త‌దిత‌రులు
సంగీత దర్శకులు: దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే, మాటలు: కోన వెంకట్, బాబీ కొల్లి, కె చక్రవర్తి రెడ్డి,
సహా నిర్మాత : జి కె మోహన్, సి ఈ ఓ : చిరంజీవి (చెర్రీ)
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు : కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)
విడుదల తేదీ: 13.01.2023

తెలుగు వారికి సంక్రాంతి పండగ లో ముఖ్యంగా కుటుంభ సమేతంగా సినిమాతో సంబరాలు జరుపుకోవడం..ఒక భాగం.  అందుకే అగ్ర హీరోల సినిమాలు థియేటర్ వద్ద సందడి చేస్తుంటాయి. తెలుగు సినీ చరిత్రలో ఒకే బ్యానర్ లో సంక్రాంతి రెండు చిత్రాలు విడుదల కావడం విశేషం. నిన్న(12.01.2023) నటసింహ నందమూరి బాలకృష్ణ వీరసింహ రెడ్డి విడుదల అయితే ఈ రోజు మెగా స్టార్, మాస్ మహా రాజా రవి తేజల 'వాల్తేరు వీరయ్య' విడుదల అయ్యింది. చిరంజీవి 'ఆచార్య' ఆశించినంతగా విజయం సాధ్యం కాకపోవడంతో మెగా అభిమానుల ఆశలన్నీ ఈ చిత్రం పైనే వున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో యువ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం లో రవితేజ కీలకమైన పాత్రలో నటించడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు వున్నాయ్. మరి సంక్రాంతి కి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' గా వచ్చిన మెగా స్టార్ మాస్ లుక్ ను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూ లో చూద్దాం.  

క‌థ‌:

సినిమా ఓపెనింగ్ రా ఆఫీస‌ర్స్ పేరు మోసిన అంతర్జాతీయ డ్ర‌గ్ డీల‌ర్ సాల్మ‌న్ సీజ‌ర్ (బాబీ సింహ‌)ను అరెస్ట్ చేసి ప్రైవేట్ జెట్‌లో తీసుకెళ్తుంటారు. టెక్నిక‌ల్ కార‌ణాల‌తో విమానం మారేడుమిల్లిలో క్రాస్ అవుతుంది. అదృష్టవత్తు అందరూ ప్రాణాలతో బయట పడతారు. అయితే ఆ రాత్రికి  క్రిమినల్ ని అక్క‌డ సమీపం లో ని మారేడుమిల్లి స్టేష‌న్‌లో ఉంచుతారు.  స్టేషన్ లోని పోలీసుల‌ను చంపేసి సాల్మ‌న్ త‌ప్పించుకుంటాడు. దాంతో ఆ స్టేష‌న్ సీఐ సీతాప‌తి(రాజేంద్ర ప్ర‌సాద్‌)ని స‌స్పెండ్ చేస్తారు. దాంతో సీతాప‌తి ఎలాగైనా సాల్మ‌న్‌ను అరెస్ట్ చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకుంటాడు. అత‌ని గురించిన డీటెయిల్స్ సేక‌రిస్తాడు. సాల్మ‌న్ మ‌లేషియాలో ఉంటాడ‌ని తెలుసుకుంటాడు. మ‌లేషియా నుంచి సాల్మ‌న్‌ను ఇండియాకు ఎలా తీసుకు రావాల‌ని ఆలోచిస్తున్న సీతాప‌తికి వాల్తేరు వీర‌య్య (చిరంజీవి) గురించి తెలుస్తుంది. వెళ్లి క‌లుస్తాడు. వీర‌య్య పాతిక ల‌క్ష‌లు కావాల‌ని డిమాండ్ చేస్తాడు. సీతాప‌తి డీల్‌కి ఒప్పుకుని.. అత‌ని మ‌నుషుల‌ను తీసుకుని మ‌లేషియా వెళ్తాడు. సాల్మ‌న్  కి చెందిన 7 స్టార్ హోటల్‌లోనే రూమ్ తీసుకుంటారు. అక్క‌డే వీర‌య్య‌కి అతిథి (శ్రుతీ హాస‌న్) ప‌రిచ‌యం అవుతుంది. వీర‌య్య‌ తానూ డ్ర‌గ్ డీల‌ర్ అని సాల్మ‌న్ ని  పరిచయం చేసుకుంటాడు. వున్నటుండి ఓ రోజు సాల్మ‌న్‌పై కొంద‌రు వ్య‌క్తులు దాడి చేస్తారు. ఆ స‌మ‌యంలో వారి నుంచి సాల్మ‌న్‌ని వీర‌య్య కాపాడుతాడు. దాంతో సాల్మ‌న్‌కి, వీర‌య్య‌కి మ‌ధ్య మంచి రిలేష‌న్ ఏర్ప‌డుతుంది.

సాల్మ‌న్ త‌నకు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేయ‌ట‌మే కాకుండా త‌న‌తో పాటు ఓసారి ఇండియా వస్తే త‌న‌కు ప‌ర‌ప‌తి పెరుగుతుందని వీర‌య్య రిక్వెస్ట్ చేస్తాడు. అందుకు సాల్మ‌న్ ఒప్పుకుంటాడు. అదే స‌మ‌యంలో సాల్మ‌న్ అన్న‌య్య మైకేల్ (ప్ర‌కాష్ రాజ్‌) కార‌ణంగా అతిథి అండ్ గ్యాంగ్ గురించి .. వాళ్లే త‌న‌పై దాడి చేశార‌నే నిజం సాల్మ‌న్‌కి తెలుస్తుంది. వాళ్ల‌ని బంధించి చంపాల‌ని చూస్తాడు సాల్మ‌న్ .. కానీ అంత‌లోనే వాల్తేరు వీరయ్య ఎంట్రీ ఇచ్చి సాల్మ‌న్‌ని చంపేస్తాడు..ఆపై  మైకేల్‌కి వార్నింగ్ ఇస్తాడు. అస‌లు మైకేల్‌ పై వీర‌య్య‌కి ఉన్న పగ  ఏంటి? అస‌లు ఏసీసీ విక్ర‌మ్ సాగ‌ర్‌ (రవి తేజ)కి వీర‌య్య‌కి ఉన్నసంబంధం ఏంటి? మైకేల్‌ను వీర‌య్య ఏం చేస్తాడు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటి నటుల హావభావాలు:

మెగా స్టార్ చిరంజీవి చాలా కాలం తరువాత అవుట్ అండ్ అవుట్ పక్కా మాస్ అవతారం లో ఇరగదీసాడు. కామెడీ లో ఆయన టైమింగ్, ఫైట్స్ లో అతని స్పీడ్, డాన్సుల్లో ఆ స్టైల్  మెగా అభిమానులకు పూనకాలు తెప్పించాయి. చిరంజీవి ని ప్రేక్షకుడు ఎలా చూడాలనుకుంటాడో దానికి న్యాయం జరిగిందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి కీలక పాత్ర ఏ సి పి  విక్రమ్ సాగర్,  ఈ విషయం లో రవితేజ వంద శాతం చిత్రానికి బలాన్ని ఇచ్చారు. ద్వితీయార్ధంలో ఎంట్రీ ఇచ్చినా సినిమా మొత్తానికి గుర్తుండిపోయే పాత్ర రవితేజ ది.  అన్నగా చిరంజీవి, త‌మ్ముడిగా ర‌వితేజ సెకండాఫ్‌లో పోటాపోటీగా నటించి ర‌ఫ్ ఆడించేశారు. ఇద్ద‌రు మ‌ధ్య కామెడీ స‌న్నివేశాలు.. యాక్ష‌న్ పార్ట్‌తో పాటు ఎమోష‌న్స్ కూడా బాగా ఆక‌ట్టుకుంటాయి. హీరోయిన్స్ కి పెద్దగా ప్రాముఖ్యతే లేదు శృతి హాసన్ ఫైట్ బాగుంది. కేథరిన్ కొన్ని సన్నివేశాలకు పరిమితం అయ్యింది. విలన్స్ గా ప్రకాష్ రాజ్, బాబీ సింహ పాత్రలు పెద్దగా చెప్పకోడానికి ఏమి లేదు. వెన్నెల కిశోర్ కామెడీ రొటీన్ గా వుంది. సత్య రాజ్, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, షకలక శంకర్, తమ పాత్రల మేర నటించారు.  

సాంకేతిక వర్గం పనితీరు:

చిరంజీవిని తామెలా చూడాల‌నుకుంటున్నామ‌ని ప్రేక్ష‌కులు కోరుకుంటున్నారో అలాంటి సినిమా వాల్తేరు వీర‌య్య అనే చెప్పాలి. దీనికి ప్ర‌ధాన కార‌ణాల్లో ముందుగా అప్రిషియేట్ చేయాల్సింది ద‌ర్శ‌కుడు బాబీ కొల్లి. మెగాభిమానిగా త‌న హీరోను ఎలా చూడాల‌ని అనుకుంటున్నాడో అలాగే స్క్రీన్‌పై ప్రెజెంట్ చేశాడు. క‌థ‌ను సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక రివేంజ్ డ్రామా.. కానీ అందులో కామెడీ, యాక్ష‌న్ ఎలిమెంట్స్‌, చిరంజీవి ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లు బాబీ అద్భుతంగా మ‌లిచాడ‌నే చెప్పాలి. చిరంజీవి ఎంట్రీ సీన్‌లో ఆయ‌నలో మాస్ యాక్ష‌న్ ఇమేజ్‌ను చూపించేసి త‌న ఇన్‌టెన్ష‌న్ ఏంటో చెప్ప‌క‌నే చెప్పేశాడు. ర‌వితేజ‌ను చిరంజీవి త‌మ్ముడి పాత్ర‌కి ఎంపిక చేసుకోవ‌ట‌మే కాదు.. ఆయ‌న్ని ఒప్పించి న‌టింప చేసుకుని ద‌ర్శ‌కుడు బాబీ మేజ‌ర్ స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. క‌థలోని ట్విస్టులు, ట‌ర్నుల‌తో సినిమాను ఏక్క‌డా ఫాస్ లేకుండా
కథను పరిగెత్తించాడు. స్టెప్ బై స్టెప్ గ్రాఫ్ ని  పెంచుకుంటూ వెళ్లిపోయాడు. ఇక ఈ మ‌ధ్య కాలంలో ఏ దర్శకుడు ఉప‌యోగించుకోని చిరంజీవిలోని కామెడీ యాంగిల్‌ను బాబీ ఎలివేట్ చేసిన తీరు బాగుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో స‌న్నివేశాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి  తీసుకెళ్లాయి. అర్థ‌ర్ ఎ.విల‌న్స్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. నిరంజ‌న్ ఎడిటింగ్ కూడా బావుంది. మైత్రి మూవీ మేకర్ నిర్మాణపు విలువలు భారీగా వున్నాయి.

విశ్లేషణ:

పూనకాలు లోడింగ్ అంటూ హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య బాగా ఆకట్టుకున్నాడు. ప్రేక్ష‌కుల‌కు చిరంజీవి వెండితెర‌పై చేసిన కామెడీ రీఫ్రెష్ ఫీలింగ్‌ను ఇస్తుంది. ఫ‌స్టాఫ్‌లో శ్రుతీహాస‌న్‌తో పండించిన కామెడీ ఆక‌ట్టుకుంటే.. సెకండాఫ్‌లో చిరంజీవి, ర‌వితేజ మ‌ధ్య స‌న్నివేశాలు మెప్పించాయి. త‌మ్ముడిపై ప్రేమ‌ను చిరంజీవి చెప్పే సీన్‌.. అలాగే అన్న‌య్య‌పై ప్రేమ‌ను ర‌వితేజ ఎక్స్‌ప్రెస్ చేసిన స‌న్నివేశం ఆడియెన్స్ హృద‌యాల‌ను ట‌చ్ చేస్తాయ‌న‌టంలో సందేహం లేదు. చిరంజీవి త‌మ్ముడిగా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో చేయాలంటే ర‌వితేజ రేంజ్ ఉన్న హీరో కావాల్సిందే. మ‌రో హీరో అయితే ఆయ‌న ఇమేజ్ ముందు క‌చ్చితంగా త‌గ్గిపోయేది.. ఆ క్యారెక్ట‌ర్‌తో డెప్త్ త‌గ్గిపోయి.. ఎమోష‌నల్ సీన్స్ కాస్త బోరింగ్‌గా అనిపించేవి. ఫస్టాఫ్‌లో చిరంజీవి ఇంట్ర‌డ‌క్షన్ ఫైట్‌.. ఇంట‌ర్వెల్ ఫైట్ పీక్స్‌ మెగా ఫ్యాన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. థియేట‌ర్స్‌లో పండ‌గ చేసుకున్నారు. ఇక సెకండాఫ్‌లో ర‌వితేజ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్ చాలా బావుంది. ఇక చిరంజీవి, ర‌వితేజ మ‌ధ్య కామెడీ స‌న్నివేశాలు.. సంద‌ర్భానుసారం వ‌చ్చే కామెడీ డైలాగులు.. అందులో చిరంజీవి చేసిన న‌ట‌న‌.. ప్రేక్ష‌కుడికి క‌నువిందుగా ఉంటుంది. అలాగే ఇంత‌కు ముందు చెప్పిన‌ట్లు ఎమోష‌న‌ల్ సీన్స్ కూడా అంతే గొప్ప‌గా పండాయి. కొత్తగా ప్రయోగాలు చేయకుండా పాత కథనే మెగా అభిమానులకు పూనకాలు లోడింగ్ చేసి నచ్చేవిధంగా, సామాన్య ప్రేక్షకులకు సరదాగా నవ్వుకోడానికి ఎంటర్టైన్ చేసిన సినిమా 'వాల్తేరు వీరయ్య'.

 

    

 

Tags :