వేటా ఆధ్వర్యంలో ఘనంగా ‘మదర్స్ డే’

వేటా ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో మదర్స్ డేను వేడుకగా జరుపుకున్నారు. అమ్మ ఔన్నత్యాన్ని కొనియాడుతూ అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని అమెరికాలోని ‘ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్’ ఘనంగా నిర్వహించింది. ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 14న యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర సెంటర్లో మదర్స్ డేను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ఫ్రాన్సిస్కో డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. అదేవిధంగా దాదాపు 500 మందికి పైగా తెలుగు వారు హాజరై.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మదర్స్ డే కార్యక్రమంలో తొలుత పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మలోని ఔన్నత్యాన్ని కళాకారులు పలు రూపాల్లో ప్రదర్శించారు. గురు సింధు సురేంద్ర నాట్యంతో అలరించగా, తెలుగు సినీ రంగానికి చెందిన గాయకులు సుమంగళి, వేణు శ్రీరంగం తెలుగు చిత్రాల్లోని అమ్మ గొప్పదనాన్ని కళ్లకు కట్టే గీతాలను ఆలపించి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. కమ్యూనిటీ పెద్దలు శ్రీమతి పద్మావతి రఘు రెడ్డి (శాంటా క్లారా కమీషనర్), డాక్టర్ హనిమి రెడ్డి ,డాక్టర్ రమేష్ జొప్ర, సిలికానాంధ్ర చైర్మన్ ఆనంద్ కూచిభొట్ల తదితరులు అమ్మ గొప్పతనాన్ని విశదీకరించారు. ఈ కార్యక్రమంలో శైలజా కల్లూరి (ప్రెసిడెంట్ ఎలెక్ట్), రత్నమాల వంకా (సాంస్కృతిక విభాగం), అనురాధ అలిశెట్టి (కార్యదర్శి), అభితేజ కొండా (సలహాదారు), హైమ అనుమాండల్ (కాలిఫోర్నియా ఆర్వీపీ), జ్యోతి పెంటపర్తి (కమ్యూనిటీ సర్వీసెస్) విశ్వ వేమిరెడ్డి (కోశాధికారి), పూజ లక్కాడి (శాకర్మెంటో ఆర్వీపీ) ప్రశాంతి కూచిభొట్ల (జాయింట్ సెక్రటరీ), సరోజ వివేక (సలహా మండలి) తదితరులు పాల్గొన్నారు.