విశాఖ వేదికగా జగన్, కేసీఆర్ కలవబోతున్నారా..?

విశాఖ వేదికగా జగన్, కేసీఆర్ కలవబోతున్నారా..?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్లీ కలవబోతున్నారా..? వాళ్ల కలయికకు విశాఖ వేదిక కాబోతోందా..?  అంటే కాస్త అటు ఇటుగా అవుననే సమాధానమే వినిపిస్తోంది. విశాఖలో ఈ నెల 27 నుంచి 31 వరకు శారదాపీఠంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎం జగన్‌‌కి ఇప్పటికే ఆహ్వానం అందింది. ఈ నెల 28న జగన్ శారదాపీఠంకి బయలుదేరనున్నారు. అదే సమయంలో కేసీఆర్‌కి కూడా బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానం అందిందని ఏపీ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ తప్పకుండా వస్తారని, వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని, స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని అంటున్నారు. అయితే కేసీఆర్ ఏ రోజు వస్తారనేదానిపై మాత్రం స్పష్టమైన తేదీ చెప్పడంలేదు. కానీ ఒకవేళ ఇద్దరు సీఎంలు ఒకే రోజు విశాఖకు చేరుకుంటే మాత్రం అది ఏపీ రాజకీయాల్లో ఓ కొత్త మలుపనే చెప్పాలి.

ఒకవేళ కేసీఆర్, జగన్ భేటీ జరిగితే రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. రాబోయేది ఎన్నికల సమయం కావడంతో ఈ రెండు పార్టీల కలయిక రెండు రాష్ట్రాల్లో రాజకీయాలను మలుపు తిప్పుతుందని విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు ఇద్దరి మధ్య రాజకీయంగా పరస్పర అవగాహన ఉందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీతో ఏపీలోనూ విస్తరించాలనుకుంటున్న కేసీఆర్.. ఈ అవకాశాన్ని కచ్చితంగా ఉపయోగించుకుంటారనేది వారి మాట.

కలిస్తే ఏమవుతుంది?

ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ ఇప్పటికే అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఏపీలో ప్రస్తుతం కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లపై వైసీపీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఒకవేళ కేసీఆర్‌ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీ ఈ సామాజిక వర్గపు ఓట్లను ఆకర్షించగలిగితే అది వైసీపీకి కచ్చితంగా కలిసొస్తుంది. దీనివల్ల వ్యతిరేక ఓటు చీలిపోయి వైసీపీ బాగా కలిసొస్తుంది. ఓట్ల శాతం పెంచుకుని బీఆర్ కూడా ఏపీలో బలం పుంజుకోగలుగుతుంది. అంటే ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నమాట. అంతేకాకుండా ప్రతిపక్షాల్లో పవన్ కళ్యాణ్ పార్టీకి బీఆర్ఎస్ ద్వారా చెక్ పెట్టాలని వైసీపీ భావిస్తున్నట్లు విశ్లేషకుల అంచనా.

 

 

Tags :