వైసీపీ తీరు చూసి విశాఖ ప్రజలు భయపడుతున్నారు: యనమల

ఆంధ్రప్రదేశ్‌లో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. వీటిలో రెండు చోట్ల టీడీపీ ఆధిక్యంలో ఉండటంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాగ్రహం ముందు మనీ పవర్, మజిల్ పవర్ ఏవీ నిలవబోవని, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఓటేశారని అన్నారు. రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉండటం వల్ల దీనిపై మాట్లాడడం తప్పు అని, కానీ విశాఖ రాజధాని కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు కూడా కోరుకోవడంలేదని ఆయన చెప్పారు. ఈ విషయంలో వైసీపీ తీరు చూసి విశాఖ ప్రజలు భయపడి పోతున్నారని అన్నారు. అలాగే ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కూడా యనమల పెదవి విరిచారు. రాష్ట్రంలో ఉన్న అప్పుల గురించి బడ్జెట్ ప్రసంగంలో చెప్పకపోవడం ఏమిటని నిలదీశారు. అప్పుగా తీసుకొచ్చిన నిధులన్నీ ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదని మండిపడ్డారు.