విశాఖకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఒకేరోజు ఒకే వేదికలో

విశాఖకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఒకేరోజు ఒకే వేదికలో

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకేరోజు ఒకే వేదికలో ఒకే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దీంతో వారి పర్యటనపై రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఈ నెల 28వ తేదీన విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామలయాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీ శారదపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఇటీవల తాడేపల్లి వచ్చి స్వయంగా సీఎం జగన్‌ను యాగానికి ఆహ్వానించారు. అదేవిధంగా హైదరాబాద్‌లో రాజశ్యామల యాగం తలపెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా స్వామీజీ విశాఖకు ఆహ్వానించారు. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రులు రాజశ్యామల యాగంలో పాల్గొని స్వామి ఆశీస్సులు తీసుకునేందుకు విశాఖను రానున్నారు.

ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీల్లో కొత్త చర్చమొదలైంది. ఈ యాగం అనంతరం ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడుకునే అవకాశాలున్నాయని జోరుగా  ప్రచారం కూడా జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతివ్వమని సీఎం జగన్‌ను కేసీఆర్‌ కోరే అవకాశం  ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని అధికార పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.  యాగం అనంతరం కొంతసేపు అయినా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకునే సందర్భం అయితే ఉంటుందని అటు తెలంగాణలోని బీఆర్‌ఎస్‌ వర్గాల్లోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ వర్గాల్లోనూ  మరో వాదన వినిపిస్తోంది.

 

 

Tags :