తెలంగాణలో తాలిబన్ల రాజ్యం నడుస్తోంది.. టీఆర్ఎస్‌పై మండిపడ్డ షర్మిల

తెలంగాణలో తాలిబన్ల రాజ్యం నడుస్తోంది.. టీఆర్ఎస్‌పై మండిపడ్డ షర్మిల

టీఆర్ఎస్ పార్టీపై వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేటలో తమ నేతలు, కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాలు దాడులు చేశారని, కానీ పోలీసులు మాత్రం టీఆర్ఎస్ తొత్తులుగా మారి నిందితులను వదిలేసి బాధితులను అరెస్ట్ చేశారని విమర్శించారు. రాజ్‌భవన్ రోడ్డులో తాను ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించలేదని ఆమె స్పష్టం చేశారు. కానీ రాష్ట్రాన్ని పాలిస్తున్న తాలిబన్ల లాంటి నేతలు తనపై తప్పుడు కేసు నమోదు చేయించారని ఆమె ఆరోపించారు. తెలంగాణలో తాలిబన్ల పాలన నడుస్తోందని, టీఆర్ఎస్ పార్టీ నేతలు తాలిబన్లేనని ధ్వజమెత్తారు. అయితే తెలంగాణ గవర్నర్ తమిళిసైతో భేటీ అయిన షర్మిల రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను గవర్నర్‌కు తెలిపారు. పోలీసులు, టీఆర్ఎస్ నేతల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వైఎస్ఆర్‌టీపీ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి కడుపుమండి టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని, నర్సంపేటలో ప్రశాంతంగా సాగుతోన్న పాదయాత్రలో శాంతిభద్రతల సమస్యను సృష్టించి తనను కావాలనే హైదరాబాద్ తీసుకొచ్చారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల దాడుల్లో ధ్వంసమైన వాహనాలను కేసీఆర్‌కు చూపేందుకు తీసుకెళ్తున్న సమయంలో పోలీసులు తనను అడ్డుకున్నారని, తాను కారులో ఉండగానే కారును క్రేన్‌తో తీసుకెళ్ళారని గుర్తు చేశారు.

 

Tags :