షర్మిల ఎవరు విసిరిన బాణం..?

షర్మిల ఎవరు విసిరిన బాణం..?

తెలంగాణలో రాజకీయమంతా ఇప్పుడు షర్మిల చుట్టూ తిరుగుతోంది. అసలు షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడమేంటి.. ఆమెను అసలు అక్కడ పట్టించుకుంటారా.. ఆమెను ఖాతరు చేస్తారా.. అని మొదట్లో చాలా మంది భావించారు. ఆమె పార్టీ పెట్టి పాదయాత్ర మొదలు పెట్టినా కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒకరిద్దరు చోటామోటా నేతలు ఆమె పార్టీలో చేరినా ఆదిలోనే చాలా మంది మళ్లీ రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయినా ఆమె ఎక్కడా వెనక్కు తగ్గలేదు. తన పని తాను చేసుకుంటూ పోయారు. ఆమె ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పైనే ఫోకస్ పెట్టారు. కేసీఆర్ సర్కార్ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని.. ఆయన కుటుంబం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శిస్తూ వచ్చారు. దీంతో టీఆర్ఎస్ నేతలు ఆమె బీజేపీ విసిరిన బాణంగా విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఇంతకూ ఆమె ఎవరు విసిరిన బాణం..?

షర్మిల వరంగల్ పర్యటన ఆమె రాతను మార్చిందనే చెప్పొచ్చు. అంతవరకూ ఎవరూ షర్మిలను కానీ, ఆమె పాదయాత్రను కానీ పట్టించుకోలేదు. కానీ అక్కడ టీఆర్ఎస్ శ్రేణులు ఆమెను అడ్డుకోవడం.. పోలీసులు అరెస్టు  చేయడం.. ఆమె ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించడం.. గవర్నర్ ను కలవడం లాంటి అంశాలన్నీ చకచకా జరిగిపోయాయి. దీంతో షర్మిల పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఆరు నెలలుగా ఆమె చేస్తున్న పోరాటానికి ఇప్పుడు ఫలితం దక్కింది. అయితే షర్మిలను బీజేపీ ఆడిస్తోందని.. అందుకే ఆమె ఇంతలా రెచ్చిపోతోందని టీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

కానీ షర్మిల మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. తాను కూడా తక్కువేమీ తినలేదన్నట్టు నోటికి పని చెప్తున్నారు. టీఆర్ఎస్ నేతలను టార్గెట్ గా చేసుకుని తిట్లదండకం వినిపిస్తున్నారు. తనపట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ఖండిస్తూ ఆమె గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు. అంతకుముందు షర్మిలపై దాడిని గవర్నర్ కూడా ఖండించారు. ఇది సరికాదన్నారు. మరోవైపు పలువురు బీజేపీ నేతలు కూడా షర్మిలకు మద్దతుగా నిలిచారు. షర్మిల కారులో ఉండగానే ఆమెను క్రేన్ తో లాక్కెళ్లడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులు తప్పుబట్టారు. బీజేపీ నేతలంతా ఒక్కసారిగా షర్మిలకుమద్దతు పలకడం, గవర్నర్ తమిళిసై ఖండిచడం లాంటి పరిణామాలు టీఆర్ఎస్ కు మరిన్ని ఆయుధాలిచ్చినట్లయింది. షర్మిల వెనుక బీజేపీ ఉందని తాము మొదటి నుంచి చెప్తూనే ఉన్నామని.. ఇప్పుడు అది రుజువైందని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.

అయితే షర్మిల మాత్రం టీఆర్ఎస్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. నిన్నటివరకూ టీఆర్ఎస్, బీజేపీ కలిసి చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగాయని.. ఇప్పుడు తనపైన వాళ్లు ఇలాంటి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని షర్మిల తిప్పికొడుతోంది. తాను ఎవరో విసిరిన బాణమో అయితే తనకెందుకు ఇన్ని కష్టాలుంటాయని ప్రశ్నిస్తోంది. నేరుగా వారి పార్టీలోనే చేరిపోయే దాన్నని.. ఇలా పాదయాత్రలు చేయాల్సిన అవసరం ఉండేది కాదని చెప్తున్నారు. మరి షర్మిల నిజంగా ఎవరు విసిరిన బాణమో తెలియాలంటే ఎన్నికల వరకూ వేచి చూడాలి.

 

 

Tags :