వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్.. చర్చనీయాంశంగా తులసమ్మ వాంగ్మూలం

వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్.. చర్చనీయాంశంగా తులసమ్మ వాంగ్మూలం

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇంకా తేలలేదు. ఆయన హత్యకు అసలు కారణాలను గానీ చేసిన వారిని గానీ ఇంకా పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఈ కేసులో ఇంకా కోర్టు విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ కేసు పలు మలుపులు తిరిగింది. తాజాగా ఈ కేసు విచారణలో శనివారం ఆసక్తికర ట్విస్ట్ వెలుగుచూసింది. ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ రోజు కోర్టు విచారణకు హాజరైన ఆమె పులివెందుల మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ఆరుగురిని విచారించాల్సి ఉందని ఆమె అన్నారు. వారిలో వైఎస్ వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బీటెక్ రవి, నీరగుట్టు ప్రసాద్, కొమ్మ పరమేశ్వర్ రెడ్డి, వివేకా బావమరిది శివప్రసాద్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి పేర్లు ఉన్నాయి. వారిని కూడా ప్రశ్నించాలని ఆమె విన్నవించారు. అయితే తులసమ్మ 2021 ఫిబ్రవరిలో కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇన్నాళ్లకు ఆమె వాంగ్మూలం రికార్డ్ చేసుకున్నారు. అయితే ఈ కేసులో ఆర్ధిక అంశాలతో సహా కుటుంబ వివాదాలు కూడా ఉన్నాయని, సీబీఐ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని తులసమ్మ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కేసులో అనేక కోణాలు, విషయాలు బయటకు రావాల్సి ఉందని ఆమె అన్నారు.

 

 

Tags :