వైఎస్సార్ రైతు భరోసా.. పుంజుకున్న వ్యవసాయ పనులు

వైఎస్సార్ రైతు భరోసా.. పుంజుకున్న వ్యవసాయ పనులు

ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌ సీజన్‌కు ముందుగానే వైఎస్సార్‌ రైతు భరోసా కింద 50.10 లక్షల మంది రైతులకు తొలి విడతగా రూ.7,500 చొప్పున రూ.3,757.70 కోట్ల పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. గత ఖరీఫ్‌లో వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న 15.61 లక్షల మందికి రికార్డు స్థాయిలో రూ.2,977.82 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందించింది. మొత్తంగా రూ.6,735.52 కోట్ల సాయం చేసింది. దీంతో రైతులకు ఖరీఫ్‌ సాగుకు పెట్టుబడికి ఢోకా లేకుండా పోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఖరీఫ్‌ ఊపందుకుం టోంది. ముందస్తుగా సాగు నీటి విడుదలతో ఏరువాక కంటే ముందుగానే రైతులు కాడెత్తి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మరో వైపు ఆశించిన స్థాయి వర్షాలతో జోరు పెంచారు. ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు ప్రకృతి కూడా సహకరిస్తుండడంతో మూడేళ్ల కంటే మిన్నగా దిగు బడులు సాధించాలని రైతులు కదంతొక్కుతున్నారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలకరి ప్రారంభ మైంది మొదలు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్‌లో జూలై మూడో వారానికి 192.9 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 222.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే అధిక, అత్యధిక వర్షపాతాలే నమోద య్యాయి. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 248 మి.మీ కురవాల్సి ఉండగా, 342.8 మి.మీ (38.1% అధికం), దక్షిణ కోస్తా జిల్లాల్లో 150 మి.మీకు 165.4 మి.మీ (10.3% అధికం), రాయలసీమలో 98.4 మి.మీ కురవాల్సి ఉండగా, 100.5 (2.2 శాతం అధికం) వర్షపాతం కురిసింది. సాధారణంగా సీజన్‌ ప్రారంభంలో విత్తిన తర్వాత కొంత నీటి ఎద్దడికి గురవడం జరుగుతుంది. కానీ, తొలిసారి రాయలసీమతో సహా రాష్ట్రంలో ఎక్కడా ఇప్పటి వరకు ఏ పంటకూ నీటి ఎద్దడి సమస్య తలెత్తలేదు.

మొక్క నిలదొక్కు కోవడంతో కొన్ని ప్రాంతాల్లో మాను కట్టే దశకు చేరుకోగా, మరికొన్ని ప్రాంతాల్లో పిలక దశకు చేరు కుంది. పైగా ఎక్కడా ఇప్పటి వరకు తెగుళ్లు, పురుగుల జాడ కన్పించలేదు. దానికితోడు ఈ సీజన్‌కు 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటి వరకు 12.20 లక్షల టన్నులు అందుబాటులో ఉంచారు. ఇందులో 4.22 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. ఇంకా 7.98 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. జూలై నెలకు 3,92,899 టన్నుల ఎరువులు అవసరం. కానీ, డిమాండ్‌ కంటే రెట్టింపు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఆర్బీకేల్లో ప్రత్యేకంగా 1,24,366 టన్నుల ఎరువులను నిల్వ చేయగా, ఇప్పటి వరకు 59 వేల టన్నులు రైతులకు విక్రయించారు. జూలై నెలకు కేంద్రం కేటాయించిన 3,92,987 టన్నుల ఎరువులు రావాల్సి ఉంది. ఇవి కూడా వస్తే సీజన్‌ ముగిసే వరకు ఎరువులకు ఢోకా ఉండదు. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రూ. 50 కోట్ల విలువైన పురుగుల మందు లను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచింది.

ఆర్బీకేల ద్వారా 6.33 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సిద్ధం చేయగా, ఇప్పటికే 5.21 లక్షల క్వింటాళ్ల రైతులకు పంపిణీ చేశారు. ప్రధానంగా 1.40 లక్షల క్వింటాళ్ల వరి, 3.04 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అందించారు. తొలిసారిగా ఏజెన్సీ ప్రాంతాల్లో 18 వేల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచగా, ఇప్పటికే 11 వేల క్వింటాళ్ల 90 శాతం సబ్సిడీపై గిరిజన రైతులకు పంపిణీ చేశారు. నాన్‌ సబ్సిడీ విత్తనాలకు సంబంధించి పత్తి 88.15 క్వింటాళ్లు, మిరప 0.86 క్వింటాళ్లు, జొన్నలు 2.25 క్వింటాళ్లు, సోయాబీన్‌ 37.20 క్వింటాళ్లను రైతులకు విక్రయించారు.

 

Tags :