MKOne TeluguTimes-Youtube-Channel

అవినాశ్ రెడ్డి ధైర్యంగా విచారణకు హాజరైంది అందుకేనా..?

అవినాశ్ రెడ్డి ధైర్యంగా విచారణకు హాజరైంది అందుకేనా..?

వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు ఎన్ని మలుపులు తీసుకుంటోందో కళ్లారా చూస్తున్నాం. ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందోనని ఆతృతగా ఎదురు చూస్తున్నాం.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ను తలపిస్తున్నఈ కేసులో వివేకా కుటుంబసభ్యుల పాత్ర ఉండడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఇంత వరకూ జరిగిన విచారణ ఓ ఎత్తయితే ఇప్పుడు జరుగుతున్నది మరో ఎత్తు. ఇప్పుడు కేసు విచారణ ఎంపీ అవినాశ్ రెడ్డి కుటుంబం దగ్గర ఆగింది. ఈ విచారణ పూర్తయితే తదుపరి పరిణామాలు కొలిక్కి రావచ్చు.

కడప ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డిని సీబీఐ ఇప్పటి వరకూ మూడుసార్లు విచారించింది. వాస్తవానికి గతవారం విచారణ సమయంలోనే అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అలా జరగలేదు. కానీ మరోసారి విచారణకు రావాలని కోరింది సీబీఐ. దీంతో ఈ దఫా అరెస్ట్ ఖాయమనుకున్నారు. దీంతో అవినాశ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై అరెస్టు లాంటి కఠినమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరిస్తూ.. సోమవారం వరకూ యదాతథస్థితిని అవలంబించాలని ఆదేశించింది.

మరోవైపు ఇవాళ విచారణకు రావాలని సీబీఐ ఆదేశించింది. కానీ తనకు పార్లమెంటు సమావేశాలు ఉన్నందున విచారణకు రాలేనని.. మరోసారి వస్తానని అవినాశ్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. కానీ సీబీఐ నుంచి రిప్లై రాలేదు. దీంతో చేసేదేమీ లేక అవినాశ్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారు. సోమవారం వరకూ కఠిన చర్యలు తీసుకోకుండా హైకోర్టు అభయమివ్వడంతో అవినాశ్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారని తెలుస్తోంది. అయితే ఇంతకు ముందు లాగా ఎలాంటి హడావుడి లేదు. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడలేదు. హైకోర్టు అక్షింతలు వేయడంతో సంయమనం పాటించినట్లు అర్థమవుతోంది.

అయితే సోమవారం హైకోర్టు తీర్పు తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తి కలిగిస్తోంది. అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ విచారిస్తోంది. హత్యలో పాల్పంచుకున్న నిందితులు అవినాశ్ కుటుంబంతో టచ్ లో ఉన్నట్టు సీబీఐ నిర్ధారణకు వచ్చింది. ఇప్పుడు వీళ్ల పాత్ర తేలితే కేసు కొలిక్కి వచ్చినట్లేనని భావిస్తున్నారు.

 

 

Tags :