129 మందిలో 40 మంది భారత విద్యార్థుల విడుదల

129 మందిలో 40 మంది భారత విద్యార్థుల విడుదల

09-02-2019

129 మందిలో 40 మంది భారత విద్యార్థుల విడుదల

ఫార్మింగ్టన్‌ నకిలీ వర్సిటీ వివాదంలో చిక్కుకొని జైలుపాలైన తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రంగంలోకి దిగింది. తొలి ప్రయత్నంలో 129 మందిలో 40 మంది విద్యార్థులను బెయిల్‌పై విడుదల చేయించింది. మిగతా విద్యార్థులను విడుదల చేయాలంటూ తానా అధ్యక్షుడు సతీశ్‌ వేమన నేతృత్వంలోని బృందం అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్‌ శృంగ్లాను కలిసింది. ఆయనతో పాటు ఇతర కాన్సుల్‌ జనరళ్లను, 17 మంది అమెరికా కాంగ్రెస్‌ సభ్యులను కూడా కలిసిన తానా బృందం.. మిగతా విద్యార్థులను విడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

న్యూయార్క్‌లో జరిగిన ఒక సమావేశంలో తానా సభ్యులు వీరిని కలిశారు. ఈ సందర్భంగా సతీశ్‌ వేమన మాట్లాడుతూ భారత విద్యార్థుల అరెస్టు అంశం చాలా సంక్లిష్టమైనది. ఈ చిక్కుముడి వీడాలంటే భారత ప్రభుత్వం చురుకైన పారత పోషించాలి అని అన్నారు. ఈ సమావేశంలో కాన్సుల్‌ జనరల్స్‌ సందీప్‌ చక్రవర్తి, అనుపమ రాయ్‌, నీత్‌ భూషణ్‌, స్వాతి కులకర్ణి, సంజయ్‌ పాండా, తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు జె.తాళ్లూరి, సంయుక్త కోశాధికారి అశోక్‌ కోలా పాల్గొన్నారు.