సీసీఎంబీలో ఇండో- యూఎస్‌ వర్క్‌షాప్‌ ప్రారంభం

సీసీఎంబీలో ఇండో- యూఎస్‌ వర్క్‌షాప్‌ ప్రారంభం

18-01-2020

సీసీఎంబీలో ఇండో- యూఎస్‌ వర్క్‌షాప్‌ ప్రారంభం

జనాభాలో వైవిధ్యం ఉన్నట్లే, వ్యాధుల బారిన పడటం, చికిత్సకు ప్రతిస్పందించే విధానంలోనూ తేడాలుంటాయని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్‌ రాకేశ్‌ కే మిశ్రా అన్నారు. జన్యు సమాచారం ఆధారంగా మరింత ప్రభావవంతమైన చికిత్సను అందించడం సాధ్యమవుతుందని హ్యూమన్‌ డైవర్సిటీ అండ్‌ హెల్త్‌ డిస్పారిటీస్‌ అనే అంశంపై సీసీఎంబీలో ఇండో-యూఎస్‌ వర్క్‌షాప్‌ నిర్వహించారు. ప్రపంచంలోని వివిధ జాతుల ప్రజల్లో జన్యు ఆధారిత వ్యాధులపై పరిశోధనలు చేస్తున్న భారత్‌, అమెరికా శాస్త్రవేత్తలు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. దక్షిణాసియా, అమెరికాలో క్యాన్సర్‌, డయాబెటిస్‌, గుండె, నరాల వ్యాధులకు కారణమవుతున్న జన్యు రూపాల గురించి పరిశోధకులు వివరించారు. జన్యు సమాచారం ఆధారంగా అందించే చికిత్స పద్ధతుల గురించి చర్చించారు.

సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్‌ తంగరాజ్‌, అలబామా యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ కేశవ్‌సింగ్‌ మాట్లాడుతూ ప్రస్తుతమున్న సమాచారం యూరప్‌ జనాభాకు సంబంధించినదని, వ్యక్తి ఆధారిత వైద్యాన్ని వృద్ధి చేసేందుకు పాపులేషన్‌ స్పెసిఫిక్‌ జెనిటిక్స్‌ డేటాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించారు. భారత్‌, అమెరికాకు విశ్వవిద్యాలయాలు, దవాఖానలకు చెందిన దాదాపు 200 మంది పరిశోధకులు ఈ వర్క్‌ షాప్‌లో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య ఫలవంతమైన భాగస్వామ్యాన్ని పెంపొదించేందుకు ఇండో-యూఎస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫోరం, ఇండియన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, యూఎస్‌ఏ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ శాఖలు సంయుక్తంగా ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించాయి.