ASBL Koncept Ambience
facebook whatsapp X

ఐపీఎస్‌లపై వేటు..! అనుకున్నట్టే జరుగుతోందా..!?

ఐపీఎస్‌లపై వేటు..! అనుకున్నట్టే జరుగుతోందా..!?

ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలంగా సినీ నటి, మోడల్ కాదంబరి జత్వానీ వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది పోలీసులు, రాజకీయ నాయకులు తనను వేధించారంటూ ఆమె ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై విచారణకు ఆదేశించింది. విచారణాధికారి ఇచ్చిన నివేదిక మేరకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. అయితే ఈ వ్యవహారం ఇప్పటితో ఆగేలా లేదు. మున్ముందు మరిన్ని పేర్లు కూడా ఈ కేసులో వచ్చే ఆవకాశం ఉందని తెలుస్తోంది.

ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో చీటింగ్ కేసు పెట్టారు. ఇబ్రహీంపట్నంలో ఫిబ్రవరి 2న ఈ కేసు నమోదైంది. అదే రోజు విశాల్ గున్ని బృందం ముంబై వెళ్లి కాదంబరి జత్వానీ కుటుంబాన్ని విజయవాడ తీసుకొచ్చింది. 40 రోజుల పాటు వాళ్లను ఇక్కడే ఉంచి బెదిరించడం, ముంబైలో పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోవాలని హెచ్చరించడం లాంటివి చేశారని జెత్వాని ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 2న కేసు నమోదైతే 1వ తేదీనే వీళ్లంతా ముంబైకి టికెట్లు బుక్ చేసుకోవడం కేసులో కుట్రకోణాన్ని బయటపెట్టింది. కేసును విచారిస్తున్న ఐపీఎస్ అధికారి స్రవంతి రాయ్ ఇదే విషయాన్ని డీజీపీకి నివేదించారు.

విచారణాధికారి స్రవంతి రాయ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా డీజీపీ సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటికే నాటి విజయవాడ కమిషనరేట్ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం పీఎస్ సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేశారు. తాజాగా ఐపీఎస్ అధికారులు పి.సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్ గున్నిలపై కూడా డీజీపీ వేటు వేశారు. నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు సూచనల మేరకు కాంతిరాణా తాతా, విశాల్ గున్ని నడుచుకున్నారని విచారణలో తేలింది. అన్నిటికీ మించి నాడు ఈ కేసులో కీలకపాత్ర పోషించిన కొందరు పోలీసు అధికారులు అప్రూవర్లుగా మారడంతో ఈ కేసు మరో మలుపు తీసుకుంది.

ఐపీఎస్ అధికారులపైన కూడా వేటు పడడంతో మున్ముందు ఈ కేసులో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఆసక్తి కలిగిస్తోంది. జెత్వానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడంతో పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలను కూడా విచారించాల్సి ఉంది. వీళ్ల నుంచి ఆధారాలను కూడా పోలీసులు సేకరించనున్నారు. అదే జరిగితే కొంతమంది ముఖ్యనేతల పేర్లు కూడా బయటికొస్తాయని భావిస్తున్నారు. కుక్కల విద్యా సాగర్ తనకు రక్షణ కల్పించాలంటూ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :