ASBL Koncept Ambience
facebook whatsapp X

భారత రాజ్యాంగ దినోత్సవం .. 75 ఏళ్ల అభివృద్ధి మైలురాళ్లు...

భారత రాజ్యాంగ దినోత్సవం .. 75 ఏళ్ల అభివృద్ధి మైలురాళ్లు...

భారత రాజ్యాంగానికి ఎంతో విశిష్ట ఉంది.. పరిపాలన అంశాలే కాకుండా స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు.. సామాజిక, ఆర్థిక బేధాలు, వివక్ష లేకుండా ప్రజలను దేశంగా కలిపి ఉంచడంలో రాజ్యాంగానిది కీలక పాత్ర.. 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలతో ఏర్పాటైన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. గత ఏడు దశాబ్దాలుగా జరిగిన మార్పుల్లో ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 448 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు ఉన్నాయి.

1949 నవంబర్‌ 26వ తేదీన భారత రాజ్యాంగ సభ... భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26న భారత రాజ్యంగం అమలులోకి రాగా.. ఆరోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగం అనగానే ప్రతి ఒక్కరికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గుర్తుకు వస్తారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్‌గా ఉన్న అంబేద్కర్.. రాజ్యాంగ రూపకల్పనకు నాయకత్వం వహించారు. భారత రాజ్యాంగం మూలాలు 1935 నాటి భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నాయి. ఇది సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా దేశ భవిష్యత్తును నిర్వచించడానికి సమగ్ర ఫ్రేమ్‌వర్క్ రూపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. అయితే భారతదేశ స్వాతంత్య్రానికి కొన్ని నెలలముందు 1946 డిసెంబర్ 6న రాజ్యాంగ పరిషత్ ఆవిర్భావం జరిగింది. అప్పటి నుంచి 1949 నవంబర్ 26 వరకు రాజ్యాంగానికి ఒక రూపు తీసుకురావడానికి పెద్ద కసరత్తే సాగింది.

రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947లో ముసాయిదా కమిటీ ఏర్పడింది. దీనికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఏడుగురు సభ్యులతో కూడి ఈ కమిటీ రాజ్యాంగ తుది ప్రతిని రూపొందించింది. రెండు సంవత్సరాల వ్యవధిలో కమిటీ 11 సమావేశాలలో నిశితంగా చర్చలు జరిపింది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను, అభ్యంతరాలను సైతం స్వీకరించింది. రాజ్యాంగ రచన పూర్తి కావడానికి మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందింది. ఆ తర్వాత 1950 జనవరి 26 భారత రాజ్యాంగం సంపూర్ణంగా అమలులోకి వచ్చింది.

దేశ ప్రజలలో రాజ్యాంగ విలువల పట్ల అవగాహనను పెంపొందించడానికి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నవంబర్ 26ని లా డేగా నిర్వహించింది. అయితే 2015 నుంచి నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఆ ఏడాది అంబేద్కర్ 125వ జయంతి జరగడం.. రాజ్యాంగ విలువలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించడం మొదలుపెట్టింది.

భారత రాజ్యాంగ దినోత్సం ఎందుకు జరుపుకుంటారు?

భారత రాజ్యాంగంలో న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం పొందుపరచబడ్డాయి. దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించేలా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రజాస్వామ్యం, జాతీయ సమైక్యత సూత్రాలను పటిష్టం చేస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగ పరిషత్ చేసిన కృషిని స్మరించుకునేందుకు ఉపయోగపడుతుంది. పౌరులు తమ పౌర బాధ్యతలను,రాజ్యాంగం అందించిన హక్కులను గుర్తించేందుకు ఒక రిమైండర్‌గా పనిచేస్తుంది.

 

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :