సుసంపన్నమైన సాహిత్యం తెలుగు భాషకే సొంతం... వెంకయ్య నాయుడు
దోహలో ఘనంగా జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
సాహిత్యమే ఒకజాతి మనుగడకు లిఖితాధారం.. ఒక దేశ వైభవాన్ని అక్కడి సాహిత్యం ప్రతిబింబిస్తుందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. సాహిత్యమే చరిత్రకు సమగ్రమైన సాక్ష్యమని తెలిపారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆంధ్ర కళావేదిక-ఖతార్ ఆధ్వర్యంలో దోహాలో జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అనంతరం వంగూరి ఫౌండేషన్ వెబ్‌సైట్‌తోపాటు పలు ప్రచురణలు ఆవిష్కరించారు. సాహిత్య-సాంస్కృతిక వైభవానికి భారతదేశమే నిలువెత్తు సాక్ష్యమని, అందులోనూ తెలుగుకు సుసంపన్నమైన సాహిత్యం ఉందని ప్రస్తావించారు. తెలుగు భాష సంస్కృతులకు పట్టం కడుతూ తెలుగు నేలకు దూరంగా ఉన్నా ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన వంగూరి ఫౌండేషన్ అధ్యక్షుడు వంగూరి చిట్టెన్ రాజు, ఆంధ్ర కళావేదిక అధ్యక్షుడు భాగవతుల వెంకప్ప, బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
రెండు దశాబ్దాల క్రితం తెలుగు దూరదర్శన్‌లో ప్రసారమైన రాజశేఖర చరిత్ర, కాంతం కథలు, వేయిపడగలు, అమరావతి కథలు వంటి ధారావాహికల గురించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రస్తావించారు. ఆ తర్వాత అలాంటి ప్రయత్నాలు సమగ్రంగా జరగలేదని, తెలుగు సాహిత్యాన్ని ఓటీటీ ద్వారా ఈ తరం యువతకు పరిచయం చేయాలని కళాకారులకు, సాహితీ సంస్థలకు సూచించారు. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని అందరూ అస్వాదించే విధంగా పరిపక్వత స్థాయిని బట్టి ప్రతి ఒక్కరికీ చేరువ చేసే ప్రయత్నాలు సాగాలన్నారు. ఓ జాతి పరిణతికి అందులో వస్తున్న సాహిత్యమే ప్రతిబింబం. కవులు, రచయితలు, మేధావులు, విలేకరులు సైతం రాసే ముందు సామాజిక స్పృహతో, బాధ్యతాయుతంగా రచనలు చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా సాహిత్యంలో కూడా మార్పులు రావాలి. ఇందు కోసం రచయితల చొరవ మరింత పెరగాలి. సృజనాత్మకతకు, మానవీయ విలువలకు, సామాజిక చైతన్యానికి పెద్ద పీట వేసే విధంగా నూతన పంథాలో రచనలు రావాలి. అవినీతి, అరాచకం, వివక్షలకు వ్యతిరేకంగా రచనలు చేసేందుకు రచయితలు ఉద్యుక్తులు కావలసిన అవసరం ఉంది.
ఈ కార్యక్రమంలో ఖతార్‌లో భారత రాయబారి విపుల్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఆంధ్ర కళా వేదిక-ఖతార్ అధ్యక్షుడు వెంకప్ప భాగవతార్, వంశీ ఆర్ట్స్ థియేటర్ వ్యవస్థాపకుడు డాక్టర్ వంశీ రామరాజు, పలువురు తెలుగు సినీ, రాజకీయ, సాహిత్య ప్రముఖులు పాల్గొన్నారు. డాక్టర్ వెంకట మాధవీ లలిత జినుగు రాసిన ‘లలితా మాధవీయం శతకం’ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.. ఖతార్‌లో నివశిస్తున్న తొలి తెలుగు పద్య శతకకర్తగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఆమెను అభినందిస్తూ ఎం.వెంకయ్యనాయుడు ధ్రువీకరణ పత్రం అందజేశారు.