ASBL Koncept Ambience
facebook whatsapp X

Revanth Reddy : రేవంత్ రెడ్డిని ముప్పతిప్పలు పెడుతున్న వరుస వివాదాలు..!!

Revanth Reddy : రేవంత్ రెడ్డిని ముప్పతిప్పలు పెడుతున్న వరుస వివాదాలు..!!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. ఈ సందర్భంగా ఘనంగా ఏడాది ఉత్సవాలను నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ప్రజాపాలన ప్రజా ఉత్సవాల పేరిట 9 రోజుల పాటు ఈ సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ప్రణాళిక రూపొందించింది. అయితే ఓ వైపు సంబరాలు చేసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుండగా.. మరోవైపు వరుస సంఘటనలు ఆ పార్టీకి ఊపిరి సలపనివ్వట్లేదు. ప్రతిపక్ష బీఆర్ఎస్ వీటిని హైలైట్ చేస్తూ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వీటిని ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇటీవలికాలంలో కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల సంఘటన తీవ్ర వివాదాలకు దారి తీసింది. ఇక్కడ ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకోసం ప్రభుత్వం భూసేకరణకు సిద్ధమైంది. ఇందుకోసం అక్కడికి వెళ్లిన కలెక్టర్ పై స్థానికులు దాడి చేశారు. ఇది వివాదాలకు దారితీసింది. పలువురిని ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు. దీని వెనుక బీఆర్ఎస్ హస్తముందని ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు భూసేకరణకు స్థానికులు ఇప్పటికీ ససేమిరా అంటున్నారు. దీంతో భూసేకరణను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. మొత్తంగా చూస్తే లగచర్ల అంశాన్ని హ్యాండిల్ చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందనే టాక్ నడుస్తోంది.

దీని తర్వాత దిలావర్ పూర్ లో ఇథనాల్ ప్లాంట్ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు ఆర్డీఓపై దాడి చేసినంత పని చేశారు. వాస్తవానికి ఈ అంశం చాలాకాలంగా వివాదాల్లో ఉంది. ఈ ప్లాంటుకు బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు లభించాయి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఈ ప్లాంట్ ను వ్యతిరేకిస్తూ స్థానిక రైతులకు అండగా నిలుస్తోంది. పరిస్థితులు చేయిదాటి పోయిన తర్వాత ప్రభుత్వం రంగంలోకి దిగి దీనికి అనుమతులు ఇచ్చింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్తోంది. ఈ పని ముందే చేసి ఉంటే బాగుండేదనే టాక్ వినిపిస్తోంది. ప్రణాళిక లేకుండా ముందుకెళ్లడం వల్లే ఇప్పుడు సమస్యలు వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక స్కూల్ హాస్టళ్లలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. ఒక స్కూల్లో ఇలా జరిగితే పర్లేదు.. కానీ వరుసగా ఇలాంటి సంఘటనలు రోజూ ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. నాణ్యమైన ఆహార పదార్థాలను సప్లై చేయట్లేదని.. అందుకే విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలవుతున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. విద్యార్థులకు మద్దతుగా ఉద్యమిస్తోంది. దీంతో హాస్టళ్లలో ఆహారంపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని కమిటీని ఏర్పాటు చేశారు. వెంటనే ప్రక్షాళన చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మరోవైపు హాస్టళ్లలో అపరిశుభ్రత వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని కాంగ్రెస్ మంత్రులు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా ఒకదానికొకటి వరుసగా రేవంత్ సర్కార్ కు చుక్కలు చూపిస్తున్నాయి. వీటిని ట్యాకిల్ చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. 

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :