Kasthuri : తెలుగోళ్లంటే అంత చులకనా... కస్తూరీ...!?
తమిళ నటి, బీజేపీ నేత కస్తూరి తాజాగా తెలుగువాళ్లపై చేసిన కామెంట్స్ తీవ్ర వివాదానికి కారణమవుతున్నాయి. తమిళ రాజుల అంతఃపురాల్లోని కుటంబాల్లో మహిళలకు సేవ చేసేందుకు వచ్చినవాళ్లో ఈ తెలుగోళ్లు అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలిప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను అలా అనలేదని.. తన మాటలను ఓ పార్టీ నేతలు వక్రీకరిస్తున్నారని కస్తూరి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కస్తూరి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని.. లేకుంటే ఊరుకునేది లేదని పలువురు హెచ్చరిస్తున్నారు.
ఆదివారం చెన్నైలోని ఓ కార్యక్రమంలో బీజేపీ నేత, నటి కస్తూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. కొన్నేళ్ల కిందట అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగోళ్లు.. ఇప్పుడు తమదే అసలు తమిళ జాతి అని చెప్పుకుంటుంటే సిగ్గేస్తోందన్నారు. మరి అంతకుముందే ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదనే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించారు. స్టాలిన్ నేత్రుత్వంలోని డీఎంకే ప్రభుత్వంలో ఐదుగురు తెలుగు మాట్లాడే మంత్రులున్నారని కస్తూరి అన్నారు. తమిళనాడుకు బతుకుదెరువుకోసం వలస వచ్చిన తెలుగువాళ్లు ఇప్పుడు పెత్తనం సాగిస్తున్నారనేలా కస్తూరి మాట్లాడారు.
అధికార డీఎంకేను టార్గెట్ గా చేసుకుని కస్తూరి ఈ మాటలు అన్నారు. అయితే ఇవి చినికిచినికి గాలివానగా మారాయి. కస్తూరి కామెంట్స్ పై తమిళనాడులోని పలు తెలుగు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమిళనాడు అభివృద్ధికి ముఖ్యంగా నాటి మద్రాస్ అభివృద్ధికి పాటుపడింది తెలుగువాళ్లేననే విషయం కస్తూరి తెలుసుకోవాలన్నారు. చరిత్ర తెలుసుకోకుండా తెలుగు వాళ్లపై నోరు పారేసుకోవడం తగదని హెచ్చరించారు. కస్తూరి తన కామెంట్స్ ను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమవుతున్న విషయం తెలుసుకున్న కస్తూరి తన మాటలను ఓ పార్టీ నేతలు వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నెగిటివిటీ తీసుకొచ్చి తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని.. అలాంటి వాటిని నమ్మొద్దని కోరారు. తెలుగునేల తనకు మెట్టినిల్లు అన్నారు. తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీల నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఇప్పుడు కస్తూరి చేసిన కామెంట్స్ ను డీఎంకే అస్త్రంగా చేసుకుంది. బీజేపీ నేతలు విద్వేషాలను రెచ్చగొట్టి లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టింది.
గతంలో నామ్ తమిళర్ కట్చి చీఫ్ కోఆర్డినేటర్ సీమన్ కూడా తెలుగువాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగువాళ్లంతా తమిళనాడులో పారిశుద్ధ పనులు చేసేందుకు వచ్చిన వాళ్లేనన్నారు. ఈయనపై కేసు నమోదైంది. ఇప్పుడు కస్తూరి కూడా తెలుగువాళ్లపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పలు తెలుగు సీరియళ్లలో కస్తూరి ఇప్పటికీ నటిస్తున్నారు. తమిళంలో ఆమెకు పెద్దగా అవకాశాలు లేకపోయినా తెలుగు పరిశ్రమ మాత్రం ఆమెను అక్కున చేర్చుకుంది. అయినా ఆమె ఇలా మాట్లాడడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.