ASBL Koncept Ambience
facebook whatsapp X

రేవంత్ రెడ్డికి అదానీ విరాళం.. బీఆర్ఎస్‌కు అస్త్రంగా మారిందా..?

రేవంత్ రెడ్డికి అదానీ విరాళం.. బీఆర్ఎస్‌కు అస్త్రంగా మారిందా..?

దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అదానీ పేరు మార్మోగుతోంది. వ్యాపార కాంట్రాక్టులు దక్కించుకునేందుకు దేశంలోని పలు రాష్ట్రాల అధినేతలకు అదానీ భారీ ఎత్తున లంచాలు ఇచ్చారంటూ అమెరికా ఫెడరల్ ఏజెన్సీ ఆరోపించింది. దీనిపై అక్కడ కేసు కూడా నమోదైంది. అదానీతో పాటు మరో ఆరుగురు ఇందులో దోషులని ప్రస్తావించింది. ఆయన్ను అరెస్టు చేసేందుకు సమన్లు కూడా జారీ చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు దేశంలో పెద్ద దుమారమే రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అదానీతో మోదీ స్నేహాన్ని ఎత్తి చూపుతోంది.

అదానీతో బీజేపీ నేతల స్నేహంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అదానీ వ్యవహారాన్నే ఆయన ప్రచారాస్త్రంగా ఎంచుకుంటున్నారు. దేశ సంపదను అదానీకి దోచి పెట్టేందుకే మోదీ, అమిత్ షా పని చేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా అదానీని తెరపైకి తెచ్చారు. ఇక్కడ ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా.. అదానీని దోపిడీదారుడిగా ఆరోపించారు. ముంబైని దోచుకునేందుకే మోదీ, అదానీ వస్తున్నారని ఆయన విమర్శించారు.

ఒకవైపు అదానీని తీవ్రంగా విమర్శిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అదే సమయంలో ఆ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో అదానీ భారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడం వ్యాపారవేత్తలకు కొత్త కాదు. అలాగే పారిశ్రామిక వేత్తలను తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆహ్వానిస్తుంటాయి. అందులో భాగంగానే తెలంగాణలో కూడా పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అదానీ కూడా ఇందుకు ముందుకొచ్చారు. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అదానీ.. వంద కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్కిల్ యూనివర్సిటీకి ఈ నిధులు ఇస్తున్నట్టు అదానీ వెల్లడించారు.

అయితే ఇప్పుడీ అంశాన్ని రాజకీయం చేస్తోంది బీఆర్ఎస్. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అదానీపై విమర్శలు చేస్తున్న వేళ ఆ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం విరాళాలు తీసుకోవడాన్ని ఎలా చూస్తారని ప్రశ్నిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ లో కూడా ఓ విలేఖరి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రేవంత్ రెడ్డికి అదానీ డబ్బులిచ్చారని గుర్తు చేశారు. అయితే అదానీ స్కాంలో ఎవరున్నా ఆరెస్టు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి విరాళాలకు, అదానీ అమెరికా ఇష్యూకు సంబంధమే లేదు. విద్యుత్ ఒప్పందాల కోసం లంచాలు ఇచ్చారనేది అమెరికా ఇష్యూ. ఇక్కడ అదానీ ఇచ్చింది విరాళం. అదీ నేరుగా సీఎంను కలిసి ఇచ్చారు. దీన్ని లంచాలుగా పరిగణించేందుకు వీలు కాదు. కానీ బీఆర్ఎస్ మాత్రం దీన్ని కూడా అదే గాటిన కట్టేస్తోంది.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :