Adani : అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్.. చట్టసభలను కుదిపేస్తున్న అదానీ వ్వవహారం..!!
దేశవ్యాప్తంగా ఇప్పుడు అదానీ తప్ప మరోపేరు వినిపించట్లేదు. అదానీపై అమెరికాలో (America) కేసు నమోదు కాక ముందు నుంచే ఈ ఇష్యూ హాట్ టాపిక్ గానే ఉంది. దేశంలో బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ ఎదిగిన తీరు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఆయన వెనుక మోదీ (Modi) ఉన్నారని.. ఆయనకు దేశ సంపదను బీజేపీ ధారాదత్తం చేస్తోందని కాంగ్రెస్ (Congress) ఆరోపిస్తోంది. అదానీ అక్రమాలపై హిండెన్ బర్గ్ (Hindenberg) గతంలోనే బహిర్గతం చేసిందని.. అయినా చర్యలు తీసుకోలేదని దుయ్యబడుతోంది. పార్లమెంటు (parliament) సమావేశాలు జరుగుతున్న ప్రతిసారీ అదానీ అంశాన్ని లేవనెత్తుతోంది కాంగ్రెస్. ఇప్పుడు కూడా మరోసారి అదానీ టాపిక్కే చర్చనీయాంశంగా మారింది.
అదానీ లంచాలిచ్చి (bribe) కాంట్రాక్టులు దక్కించుకున్నారని.. తద్వారా అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేశారని అమెరికాలో కేసు నమోదైంది. ఆయనపై సమన్లు కూడా జారీ అయ్యాయి. దీన్ని చట్టపరంగానే ఎదుర్కొంటామని అదానీ గ్రూప్ ప్రకటించింది. అయితే అదానీ అక్రమాలకు పాల్పడుతున్నారని.. ఆయన వ్యాపారాలు చట్టబద్దంగా లేవని తాము ముందునుంచే చెప్తూనే ఉన్నామని.. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని చెప్పిందని కాంగ్రెస్ చెప్తోంది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ కోసం పని చేస్తున్నారని.. వ్యాపారులను బెదిరించి ఆయనకు సంస్థలను కట్టబెడుతున్నారని ఆరోపించింది. అందుకే ఈ వ్యవహారంపై చట్టసభల్లో చర్చించాలని పట్టుబడుతోంది.
గత ఐదేళ్లలో కూడా కాంగ్రెస్ ఇదే విధంగా పట్టుబట్టింది. పార్లమెంటులో అదానీ అంశంపై చర్చించి, జేపీసీ వేయాలని డిమాండ్ చేసింది. ముఖ్యంగా హిండెన్ బర్గ్ రిపోర్ట్ బయటికొచ్చినప్పుడు పెద్ద దుమారమే రేగింది. అయితే ఈ అంశంపై చర్చించేందుకు బీజేపీ ఎన్నడూ ముందుకు రాలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు దీనిపై సుప్రీంకోర్టు అదానీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో హిండెన్ బర్గ్ అంశం మూలన పడింది. ఇప్పుడు అమెరికా కేసు బయటకు రావడంతో మరోసారి అదానీ అంశంపై చర్చించాలనే డిమాండ్ మొదలైంది. ఇండియా కూటమిలో మెజారిటీ పార్టీలు అదానీ పై విచారణకు పట్టుబడుతున్నాయి. అయితే బీజేపీ ఇందుకు సుముఖంగా లేదు. దీంతో సభ రోజూ చర్చ లేకుండానే వాయిదా పడుతోంది.
మరోవైపు తెలంగాణలో (Telangana) కూడా అదానీ అంశం హాట్ టాపిక్ గా మారింది. మోదీ అదానీ ఏక్ హై.. రేవంత్ అదానీ ఏక్ హై అని బీఆర్ఎస్ (BRS) ఆరోపిస్తోంది. ఢిల్లీలో అదానీపై చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంటే తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి (Revanth Reddy).. అదానీతో కలిసి పని చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ ఇష్యూపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తోంది. అదానీ – రేవంత్ ఫోటోలతో కూడిన టీషర్టులు వేసుకుని ఇవాళ అసెంబ్లీలోకి అడుగు పెట్టేందుకు బీఆర్ఎస్ సభ్యులు ప్రయత్నించారు. అయితే పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. మొత్తానికి అటు ఢిల్లీలో, ఇటు హైదరాబాద్ లో అదానీ అంశం హాట్ టాపిక్ గా ఉంది. ఇప్పట్లో ఈ అంశానికి ఫుల్ స్టాప్ పడే సూచనలు కూడా కనిపించట్లేదు.