ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు లక్కీ ఛాన్స్..!

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు లక్కీ ఛాన్స్..!

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేసి అధికారపగ్గాలు చేపట్టాయి. ఇప్పుడు ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిని కూడా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి కూటమి పార్టీలు. ముఖ్యంగా ఈ స్థానాల నుంచి టీడీపీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ స్థానాల నుంచి ఎవరిని బరిలోకి దింపుతారనే ఉత్కంఠ కొంతకాలంగా ఉంది. అయితే ఒక స్థానంలో ఎవరిని పోటీ చేయించాలనే దానిపై పార్టీ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీలో గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెవ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఓటరు నమోదు ప్రక్రియ నడుస్తోంది. ఇది పూర్తవగానే ఈ ఎన్నిక జరగనుంది. గతేడాది ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా మూడు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరిగితే మూడింటినీ టీడీపీ కైవసం చేసుకుంది. ఈ ఫలితాలు చూసిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్థమైంది. ఇప్పుడు అధికారంలో ఉండడంతో వీటిని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ. ఇటీవల ఎన్నికల్లో టికెట్లు దక్కని పలువురు నేతలు ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు పోటీ పడుతున్నారు.

అయితే కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను బరిలోకి దింపాలని టీడీపీ నిర్ణయించినట్లు సమాచారం. ఒకటి రెండ్రోజుల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పని చేసుకోవాలని చంద్రబాబు సూచించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీలో సీనియర్ నేత. తెనాలి, వేమూరు నియోజకవర్గాల నుంచి 3 సార్లు గెలుపొందారు. మంత్రిగా కూడా పని చేశారు. తాజా ఎన్నికల్లో తెనాలి నుంచి ఆయన పోటీ చేయాలని భావించారు. అయితే మిత్రపక్షం జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ ఆ స్థానాన్ని కోరుకున్నారు. దీంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ త్యాగం చేయాల్సి వచ్చింది.

ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఏదో విధంగా న్యాయం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. వాస్తవానికి ఏదైనా పెద్ద కార్పొరేషన్ పదవిని ఆయనకు కట్టబెడతారని భావించారు. అయితే తనకు చట్టసభల్లోకే రావాలని ఆసక్తి ఉందని ఆలపాటి చెప్పడంతో చంద్రబాబు అందుకు సుముఖత వ్యక్తం చేశారు. పట్టభద్రుల స్థానంలో పని చేసుకోవాలని.. పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆలపాటి అభ్యర్థిత్వానికి జనసేన, బీజేపీ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :