Adani : అదానీ వ్యవహారంపై అందరూ గప్‌చుప్..!!
దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అదానీ పేరు మార్మోగిపోతోంది. అమెరికాలో ఆయనతో పాటు మరికొందరిపై కేసు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. పలు రాష్ట్రాల ప్రతినిధులకు లంచాలిచ్చి కాంట్రాక్టులు దక్కించుకోవడం ద్వారా అమెరికా పెట్టుబడులను ఆకర్షించారని అక్కడి విచారణ సంస్థలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా లంచాలు ముట్టినట్లు ఆరోపణలు బయటకి వచ్చాయి. అయితే ఇంత పెద్ద వ్యవహారంపై దేశంలో ఎవరూ నోరు మెదపట్లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అదానీ అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తోంది. మరి మిగిలిన పార్టీలు ఎందుకు ఇందులో జోక్యం చేసుకోవట్లేదు..?
ప్రపంచంలోనే ధనవంతుల్లో ఒకడిగా పేరొందిన అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం.. ఆయన్ను అరెస్టు చేసేందుకు సమన్లు జారీ కావడం అనేది మామూలు విషయం కాదు. సమన్లు జారీ కావడంతో అదానీ ఇప్పుడు కాలు బయటపెట్టే పరిస్థితి ఉండదు. కోర్టుల్లో ఆయనకు రిలీఫ్ దొరక్కపోతే ఎప్పుడైనా ఆయన అరెస్టు కావచ్చు. ఇది దేశానికి ఎంత చెడ్డపేరు తెస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. భారతీయ కంపెనీలు, వ్యాపారవేత్తలపై ఇదొక మాయని మచ్చలాగా మిగిలిపోతుంది. తద్వారా దేశానికి కూడా చెడ్డపేరే.
అదానీ అక్రమంగా ఆర్జిస్తున్నారని.. ఇందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా అండదండలు అందిస్తోందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి అదానీ అంశంపై విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. అదానీతో డీల్ చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో కూడా విచారించాలని కోరారు. తప్పు చేసి ఉంటే వాళ్లను కూడా అరెస్టు చేయాల్సిందేనన్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డికి అదానీ వంద కోట్లు విరాళం ఇచ్చారు. పెట్టుబడులు పెడుతున్నారు. ఇక్కడ కూడా అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీంతో ఈ అంశంలో కాంగ్రెస్ కూడా పెద్దగా ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఆ పార్టీ సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్ కూడా అదానీపై గట్టిగా పట్టుబట్టే అవకాశాలు లేవు. అలా చేస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సమస్యలు తెచ్చిపెడుతుందోననే భయం గులాబీ పార్టీని వెంటాడుతోంది.
అదానీ వ్యవహారంలో ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ డీల్స్. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుదిరిన ఒప్పందానికి జగన్ కు అదానీ రూ.1750 కోట్లు లంచాలు ఇచ్చారని అమెరికా వెల్లడించింది. ఈ అంశాన్ని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని విచారణ జరపాలి. కానీ చంద్రబాబు సర్కార్ కూడా ఈ అంశంలో ముందుకు వెళ్లలేకపోతోంది. ఎందుకంటే టీడీపీ కూడా ఎన్డీయే కూటమిలో భాగమే. రాష్ట్రంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. దీనిపై విచారణ మొదలుపెడితే దాని మూలాలు ఎక్కడికి వెళ్తాయో బాబుకు తెలుసు. కాబట్టి దీని జోలికి వెళ్లట్లేదు. మొత్తంగా కాంగ్రెస్ మినహా.. తెలుగు రాష్ట్రాల్లోని మరే పార్టీలూ అదానీ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించట్లేదు. కాబట్టి అమెరికా ఎంత గింజుకున్నా ఇక్కడి సూత్రధారులు, పాత్రధారులు సేఫ్ అనే చెప్పొచ్చు.