అంతర్గత కలహాలు తో కూటమిలో కల్లోలం.. ఇక చీలికలు తప్పవా?
ఆంధ్రాలో ఎన్నికలకు ముందు కూటమి ఏర్పడినప్పటి నుంచి కింద స్థాయిలో అంతగా పొంతనలు కుదరడం లేదు అన్న వాదన వినిపిస్తోంది. అయితే నిన్న మొన్నటి వరకు హై లెవెల్ లో కూటమి పర్వాలేదు అన్న ఇంప్రెషన్ ఉండేది. కానీ ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం.. పవన్ కళ్యాణ్ హోం శాఖ పనితీరుపై చేసిన కామెంట్స్.. జనసేన, టిడిపి మధ్య ఏదో జరుగుతోంది అన్న భావన అందరిలో కలిగిస్తోంది. ఇక ఆ విషయం పక్కన పెడితే ఏపీలో టిడిపి, జనసేన మధ్య అంతా సజావుగా లేదు అన్న మాట బలంగా వినిపిస్తుంది.
ఇది కేవలం ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాకుండా.. ఎన్నో చోట్ల ఇటు టిడిపి.. అటు జనసేన మధ్య పరస్పర వివాదాలు అంతర్గతంగా చెలరేగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఏలూరు జిల్లాలోని దెందులూరు లో టిడిపి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు పొందిన చింతమనేని ప్రభాకర్.. జనసేన మధ్య జరుగుతున్న రచ్చ ఈ విషయాన్ని బలపరుస్తుంది. మరోపక్క పిఠాపురంలో వర్మ వెర్సెస్ పవన్ కళ్యాణ్.. ఏ రేంజ్ లో అంతర్గతంగా సాగుతోందో అందరికీ తెలుసు.
జనసేన తరఫునుంచి ఎమ్మెల్యేలు ఎన్నికైన ప్రాంతాలలో తమ పార్టీ ఆధిపత్యాన్ని చూపించడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. మరోపక్క టిడిపి ఎమ్మెల్యేలు కూడా తగ్గేదే లేదు అంటూ తమ ప్రాంతంలో జనసేనను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయాలు చిలికి చిలికి గాలి వానగా మారబోతున్నట్లు కనిపిస్తోంది. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో జనసేన చూపిస్తున్న ఆధిపత్యం వేరే లెవెల్ అన్నట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
అక్కడ ఎమ్మెల్యేగా జనసేన క్యాండిడేట్ గా లోకం మాధవి ఉన్నారు. అయితే ఆమె గెలుపు కోసం కూటమి మొత్తం ఎంతో కష్టపడింది. తీరా గెలిచిన తర్వాత మాత్రం ఆమె జనసేన ను బలోపేతం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరోపక్క వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చిన వారిని పట్టించుకుంటూ అసలు ఎప్పటినుంచో పార్టీలో ఉన్న వాళ్లను పక్కన పెడుతున్నారు అని ఆ ప్రాంతంలో పసుపుతమ్ముళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అక్కడ అధికారులతో సహా అందరూ జనసేన నేతల మాటలే వినాలి అని పార్టీ అనధికారిక సందేశాలు పంపుతోంది అని టిడిపి నేతల బాధ. దీంతో నెల్లిమర్ల టిడిపి ఇన్చార్జ్ అయిన కర్రోతు బంగార్రాజు వర్గం చాలా గుర్రుగా ఉన్నారు. దీంతో ఇప్పుడు కూటమిలో చీలికలు తప్పవేమో అన్న వాదన బలంగా వినిపిస్తోంది.