Ambati : అంబటి రాజకీయాల నుంచి తప్పుకుంటారా..!?
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రావట్లేదు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని.. దాని వల్ల సభకు వెళ్లినా తమకు మైక్ ఇవ్వరని వైసీపీ చెప్తోంది. అందుకే అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసినట్లు చెప్తోంది. ఈ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. సభకు వచ్చే ధైర్యం లేక వైసీపీ వాళ్లు పారిపోయారని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తమను ఎదుర్కొనే సత్తా అధికార పార్టీకి లేదని వైసీపీ నేతలు కౌంటర్స్ ఇస్తున్నారు.
వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసి శాసన మండలికి మాత్రం హాజరు కావడాన్ని టీడీపీ సభ్యులు తప్పుబడుతున్నారు. ఇదే అంశాన్ని శాసన మండలిలో మంత్రి నారా లోకేశ్ లేవనెత్తారు. దీనికి బదులిచ్చిన వైసీపీ.. గతంలో చంద్రబాబు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదని గుర్తు చేసింది. అయితే తన తండ్రి రెండున్నరేళ్ల పాటు అసెంబ్లీకి వచ్చారని.. సింగిల్ గానే సింహంలా నిలబడ్డారని లోకేశ్ బదులిచ్చారు. ఆ తర్వాత సభలో తన తల్లిని అవమానించడంతో అది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని ప్రకటించి బాయ్ కాట్ చేశారని లోకేశ్ వివరించారు. దీంతో వైసీపీ సభ్యులు కామ్ అయిపోయారు.
శాసన మండలిలో లోకేశ్ చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ లో స్పందించారు. తన తల్లికి సభలో అన్యాయం జరిగినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు గతంలో ఎప్పుడేం జరిగిందో పోస్టు చేస్తున్నారు. 2021 అక్టోబర్ 22న వల్లభనేని వంశీ బయట నారా లోకేశ్ పుట్టుకపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఎలిమినేటి మాధవరెడ్డి పోలికలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎలిమినేటి మాధవ రెడ్డి నక్సలైట్ల చేతిలో ఎలా హత్యకు గురయ్యారో చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు.
ఇదే అంశంపై 2021 నవంబర్ 19న అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు సభలో అధికార పక్షాన్ని ప్రశ్నించారు. దీనిపై చర్చకు పట్టుబట్టారు. చంద్రబాబు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన అప్పటి మంత్రి అంబటి రాంబాబు.. కచ్చితంగా చర్చిద్దామన్నారు. అరగంట కావాలో.. గంట కావాలో.. ఎలిమినేటి మాధవరెడ్డి గారి సంగతి... ఇలా అన్నింటిపైనా మాట్లాడుకుందాం అని చెప్పారు. దీంతో ఆవేదన చెందిన చంద్రబాబు నాయుడు ఇది సభాసంప్రదాయం కాదన్నారు. తన భార్యను అవమానించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని.. మళ్లీ తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసి బయటికొచ్చారు. ఇదే అంశాన్ని ఇప్పుడు అంబటికి గుర్తు చేస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు టీడీపీ నేతలు. అంబటి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి అంబటి ఆ పని చేయగలరా..?